‘కృత్రిమ’ ధోరణులపై కొరడా | Sakshi Editorial On Artificial intelligence | Sakshi
Sakshi News home page

‘కృత్రిమ’ ధోరణులపై కొరడా

Feb 13 2026 1:12 AM | Updated on Feb 13 2026 1:12 AM

Sakshi Editorial On Artificial intelligence

డిజిటల్‌ ప్రపంచంలో కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా వేషం మార్చుకుని మోసగిస్తున్న మాయగాళ్ల పనిపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. 2021లో తెచ్చిన సమాచార సాంకేతికత(ఐటీ) నిబంధనల్ని సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒకప్పుడు వదంతులుగా, లేదా తప్పుడు ప్రచారంగా చలామణీ అయిన ప్రతిదీ ఇప్పుడు అసలుగా భ్రమింపజేసే వీడియోలు, ఆడియోలుగా మారిపోతోంది. ఏది నిజమో, ఏది కాదో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 

ఎన్నికల్లో సామాన్య జనాన్ని ఏమార్చటానికి ప్రయత్నించటం దగ్గర నుంచి... మనుషుల్లో క్రౌర్యాన్నీ, హైన్యాన్నీ, నీచప్రవృత్తినీ ప్రేరేపించే, భావోద్వేగాలను రెచ్చగొట్టే ధోరణి గలవన్నీ డిజిటల్‌ ప్రపంచంలో స్వైరవిహారం చేస్తున్నాయి. వాటి ప్రభావంతో మనుషులు స్వీయనియంత్రణను కోల్పోయి, మానసిక దుర్బలులవుతున్నారు. కొందరు వ్యామోహాలకు లోనై నిలువుదోపిడీ ఇచ్చుకుంటున్నారు. ఆనక లబోదిబోమంటున్నారు. నిత్యజీవిత ఆచరణ ద్వారా, అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా ఒక క్రమపద్ధతిలో రావలసిన జ్ఞానాన్ని కృత్రిమ మేధ అడ్డుకుని, వారిలోని విచక్షణను ఆవిరి చేస్తోంది.

లింగవివక్ష అధికంగా ఉన్న సమాజాల్లో సహజంగానే మహిళలు ఈ సాంకేతికతల వల్ల బాధితులవుతున్నారు. ప్రపంచమంతటా ఇప్పుడు డిజిటల్‌ యుగం నడుస్తోంది. బుడి బుడి నడకల్లో ఉన్న బుడతల దగ్గర్నుంచి, వృద్ధుల వరకూ అందరికందరూ దీని ప్రభావం నుంచి తప్పించు కోలేకపోతున్నారు. ఇందులో పొంచివున్న ప్రమాదాన్ని అందరి కన్నా ముందు పసిగట్టింది యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ). అది రెండు మూడేళ్లపాటు శ్రమించి 2024లో తెచ్చిన ఈయూ కృత్రిమ మేధ(నియంత్రణ) చట్టం ఉన్నంతలో సమగ్రమైనది.  అయితే ఆ చట్టం వచ్చేనాటికి డీప్‌ లెర్నింగ్‌ సాంకేతికత బీజప్రాయంలో ఉంది. 

దాంతో తయారయ్యే నకిలీ(ఫేక్‌)ని చెప్పడానికి ‘డీప్‌ఫేక్‌’ పదం ఇటీవల వాడుకలోకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్‌ వల్ల ఏర్పడగల ప్రమాదతీవ్రత ఆధారంగా ఆ చట్టం వాటిని నాలుగు రకాలుగా – అంగీకారయోగ్యం కానివి, అధిక ప్రమాదంతో కూడుకున్నవి, పరిమితంగా ప్రమాదకరమైనవి, కనిష్ఠ ప్రమాదం ఉన్నవిగా వర్గీకరించింది. మన ప్రభుత్వం ఇప్పుడు రూపొందించిన నిబంధనలు వినియోగదారుడి రక్షణ, దేశభద్రతనూ ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాయి. ఈ నెల 20 నుంచి అమల్లోకొచ్చే ఆ నిబంధనలు ఇకపై ఏఐ ఆధారంగా రూపొందే ఎలాంటి కంటెంట్‌కైనా ఆ విషయాన్ని స్పష్టంగా సూచించటం తప్పనిసరి చేశాయి. 

అలాగే అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, తప్పుడుగా ఉన్నాయని ప్రభుత్వాలు, లేదా న్యాయస్థానాలు నిర్ధారించి తొలగించమని ఆదేశిస్తే... మూడు గంటల్లో శిరసావహించాలి. పాక్షిక లేదా పూర్తి నగ్నంగా చిత్రించే ఫొటోలు, వీడియోలు, శృంగార సంబంధిత కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన రెండు గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 36 గంటల గడువును వాటి తీవ్రతను బట్టి తగ్గించారు. హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ ఉన్నపక్షంలో అది తయారు చేసిందెవరో, అప్‌లోడ్‌ చేసిందెవరో కూపీలాగే ఉపకరణాలను సామాజిక మాధ్యమాలు రూపొందించుకోవటం తప్పనిసరి చేశారు.

అయితే మన ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రతిస్పందన ప్రాతిపదికగా ఉంది. రూపొందే కంటెంట్‌ ఏ పరిమితుల్లో ఉండాలన్నది ఈయూ చట్టం ముందస్తుగా నిర్దేశిస్తోంది. ఏ సామాజిక మాధ్యమమైనా ఉల్లంఘించిన పక్షంలో మన నిబంధనలు క్రిమినల్‌ కేసులకు మొగ్గుచూపుతుండగా, ఈయూ చట్టం నిర్లక్ష్యం వహించిన సామాజిక మాధ్యమానికి దాని ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 7 శాతం వరకూ జరిమానా విధిస్తోంది. 

మారుతున్న సాంకేతికతల్ని ఆసరాగా చేసుకుని ప్రతిరోజూ, ప్రతి నిమిషమూ వచ్చి పడుతున్న కంటెంట్‌ను అరికట్టడానికి నిబంధనలు ఏర్పర్చటం, చట్టాలు రూపొందించటం ఏ దేశంలో పాలకులకైనా పెను సవాలు. అంతకన్నా ముఖ్యం... అవి దుర్విని యోగం కాకుండా చూడటం! కుల, మత, రాజకీయ వివక్షతో సద్విమర్శలను నేరపూరితం చేసే ధోరణులు భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. సద్భావంతో చేసే సృజనాత్మ కతకు శాపంగా పరిణమిస్తాయి. బహుపరాక్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement