నేర్చుకోవడం మానేసి ఏఐపై ఆధారపడొద్దు
పరీక్షాపే చర్చా కార్యక్రమంలో విద్యార్థులకు ప్రధాని మోదీ హితబోధ
న్యూఢిల్లీ: సాంకేతికత అనేది విద్యార్థులను బానిసలుగా మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తంచేశారు. విద్యార్థి దశలో శిక్షణలో భాగంగా నేర్చుకునే పరంపరను కొనసాగించాలనీ అన్నింటిపై కృత్రిమ మేథ మీద ఆధారపడొద్దని ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులకు విద్యా సంబంధ చిట్కాలు, సలహాలు చెబుతూ అత్యంత ప్రజాదరణతో కొనసాగుతున్న ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం 9వ విడత రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, గుజరాత్‌లకు చెందిన పలువురు ఔత్సాహిక విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఏఐ అంటే భయమేల?
‘‘కృత్రిమ మేధ(ఏఐ) వంటి కొత్త తరం సాంకేతికతలను చూసి విద్యార్థులు భయపడొద్దు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ వాటిలోనూ మీరు రాణించాలి. ఏఐ లేదా స్మార్ట్‌ఫోన్‌ను అత్యున్నత గురువుగా భావించొద్దు. కొందరు పిల్లలకు తొలుత స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా చూశాకే వాళ్ల నోట్లోకి ముద్ద దిగుతుంది. మనం ఏఐను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. అంతేగానీ అదే మన మార్గదర్శి అనే స్థాయిలో దానికి విలువ ఇవ్వొద్దు. పాఠ్యపుస్తకాల్లో ఉన్నదానికి ఏఐ సమాచారం అనేది అదనపు విలువ జోడింపు ఇస్తుంది అనే భావనతోనే మెలగాలి.
అంతేగానీ నేర్చుకోవడం మానేసి పూర్తిగా ఏఐ ఆధారపడొద్దు. గతంలో ఎడ్లబండి మీద వెళ్లిన మనం ఇప్పుడు ఏరోప్లేన్‌లో వెళ్లినట్లుగా పాతరకం ఉద్యోగాలు మటుమాయమై ఎల్లప్పుడూ కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఉపాధి మారొచ్చేమోగానీ జీవితం మారదు. కొనసాగుతూనే ఉంటుంది. భయం, జంకూ వీడి కొత్త రకం సాంకేతికతలను నేర్చుకోవాలి. వాటిపై పట్టుసాధించాలి. సాంకేతికతతో మీ శక్తిసామర్థ్యాలను మరింత పెంపొందించుకోండి. సాంకేతికత సత్తాను మీ పనిలో చూపించండి’’అని మోదీ సూచించారు.
పాతవి తిరగేయండి.. హాయిగా నిద్రపొండి
‘‘పరీక్షలకు సంబంధించి పాత క్వశ్చన్ పేపర్లను తిరగేయండి. ప్రశ్నల తీరును అర్థంచేసుకోండి. పగలంతా పక్కా ప్రణాళికతో చదివేసి రాత్రి హాయిగా నిద్రపోండి. రాత్రి బాగా నిద్రపోతేనే ఉదయం అంతకంటే బాగా పరీక్ష రాయగల్గుతారు. పరీక్షకు బాగా సంసిద్ధమయ్యాక కొత్తగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. చక్కటి నిద్ర అనేది మిమ్మల్ని రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది’’అని అన్నారు. తమ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చి చూసే ధోరణిని తల్లిదండ్రులు విడనాడాలని మోదీ సూచించారు.
రెండింటిపై స్వారీ చేయండి
విద్య, సొంత ఇష్టాయిష్టాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉందని ఓ విద్యార్థి వెలిబుచి్చన ఆవేదనపై మోదీ తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ఓ వైపు ఆర్ట్ అంటే ఇష్టం. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగంలో రాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎటూపాలుపోక నిట్టూర్చేకంటే ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి సొంత ఇష్టాయిష్టాలపై దృష్టిపెట్టండి. విద్యకు ఎప్పట్లాగే అత్యంత ప్రాధాన్యతా ఇవ్వండి’’అని సూచించారు. అంకుర సంస్థల వైపు మొగ్గుచూపొచ్చా? అని మరో విద్యార్థి అడగ్గా..‘‘ముందు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టతకు రావాలి.
ఇప్పటికే ఉన్న సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయదలిచారా? లేదంటే డ్రోన్లు, విద్యుత్ వ్యవస్థల వంటి వాటికి కొత్త పరిష్కారాలు వెతకాలనుకుంటున్నారా? దీంట్లో స్పష్టత వస్తే అంకురసంస్థను స్థాపించాలా వద్దా అనేది తేలిపోతుంది. ముందుగా సాంకేతికత లేదా ఆర్థిక రంగాలపై పట్టున్న స్నేహితులతో ఒక బృందంగా ఏర్పడండి. స్టార్టప్‌ను ఆరంభించడానికి వయసుతో పనేలేదు. నిజంగా మీకు దీనిపై ఉత్సుకత ఉంటే ఇప్పటికే ఉన్న అంకురసంస్థలను సందర్శించండి. మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధంచేయండి. అది బాగుంటే అందరినోటా పడి చివరకు భారీ మద్దతు లభిస్తుంది. ఆర్థికసాయమూ అందుతుంది. తర్వాత ఎలా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చు’’అని మోదీ సూచించారు.


