మోదీపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలతో ముడిపడ్డ పలు అంశాలపై బదులివ్వడానికి మోదీ సర్కారు భయపడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చ నుంచి పారిపోతోందని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నవరణె పుస్తకానికి సంబంధించి సభలో తాను లేవనెత్తిన ఇబ్బందికర అంశాలపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రధాన నరేంద్ర మోదీ గత వారం లోక్‌సభకు డుమ్మా కొట్టారంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ముప్పు కారణంగానే ఆయన రాలేదన్న స్పీకర్ ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు.
‘‘అది పచ్చి అబద్ధం. అది నిజమే అయితే ముప్పుందంటున్న వాళ్లు అందుకు బాధ్యుడైన వ్యక్తిపై తక్షణం ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’’అని ప్రశ్నించారు. సోమవారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘నిండు సభలో మోదీపై దాడి చేసే ఆలోచనే కాంగ్రెస్ సభ్యులకు లేదు. ప్రజా సమస్యలతో పాటు అన్ని అంశాల మీదా అర్థవంతమైన చర్చ జరగాలనే విపక్షం కోరుకుంటోంది. సభకు వచ్చేందుకు మోదీకి దమ్ముండాలి. కానీ ఆయనకు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. సభలో అడుగు పెట్టగానే మేమెక్కడ నరవణె పుస్తకాన్ని తన చేతిలో పెడతామో అని మోదీ భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా చర్చకు భయపడుతోందన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం’’అన్నారు.


