క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్‌ | Donald Trump enters T20 World Cup 2026, announces open support to USA team | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్‌

Feb 9 2026 7:25 PM | Updated on Feb 9 2026 7:59 PM

Donald Trump enters T20 World Cup 2026, announces open support to USA team

అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా క్రికెట్‌ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్‌ఏ) ట్రంప్‌ మద్దతు ప్రకటించాడు. 

సోషల్‌ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్‌ యూఎస్‌ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్‌ ఇచ్చిన మద్దతు యూఎస్‌ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్‌ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్‌ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్‌ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్‌ మద్దతు ఉంటే క్రికెట్‌ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.

అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్‌ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్‌ మరింత చేరువైంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.  

ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ జట్టు గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్‌ఏ జట్టు మాత్రం క్రికెట్‌ ప్రపంచాన్నంతా గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement