బిగ్‌ ట్విస్ట్‌!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌! | Big twist Bangladesh asks Mohsin Naqvi to end India T20 WC Boycott | Sakshi
Sakshi News home page

బిగ్‌ ట్విస్ట్‌!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Feb 9 2026 3:59 PM | Updated on Feb 9 2026 4:07 PM

Big twist Bangladesh asks Mohsin Naqvi to end India T20 WC Boycott

టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.

ఆర్థికంగా నష్టం
గతంలో తమ జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్‌ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.

యూఏఈ లేఖ
తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) క్రికెట్‌ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్‌ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.

అయితే, టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాక్‌ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్‌ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.

పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్‌ పంపింది.

 బంగ్లాదేశ్‌ సైతం
ఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్‌ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్‌-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ ఐసీసీని ఆశ్రయించిది.

తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.

మొహ్సిన్‌ నక్వీతో చర్చలు
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్‌.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.

మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీ
ఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్‌ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.

అదే సమయంలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్‌ నక్వీని కోరిట్లు సమాచారం.

ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. 

చదవండి: ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

Advertisement
 
Advertisement
Advertisement