గోల్డెన్‌ డక్‌!.. మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ ఫెయిల్‌ | Shreyas Iyer 5 off 13 after a golden duck Is justifies Agarkar T20 WC Snub call | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ డక్‌!.. మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ ఫెయిల్‌

Feb 27 2026 7:39 PM | Updated on Feb 27 2026 7:51 PM

Shreyas Iyer 5 off 13 after a golden duck Is justifies Agarkar T20 WC Snub call

టీమిండియా జెర్సీలో శ్రేయస్‌ అయ్యర్‌

టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్‌తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రేయస్‌ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. కివీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్‌ అయ్యర్‌ లోకల్‌ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్‌ టీ20 కప్‌లో ఈ ముంబైకర్‌ BPCL జట్టుకు ఆడుతున్నాడు.  

తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌
ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్‌ అయ్యర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మరోసారి ఫెయిల్‌
ఇక రెండో మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. రిలయన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ముంబైకర్‌ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.

అగార్కర్‌ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లు
ఆసియా టీ20 కప్‌-2025 ఆడిన జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శ్రేయస్‌ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్‌ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.

ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్‌-2026 టోర్నీకి ముందు లోకల్‌ టోర్నమెంట్లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్‌ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్‌ అయ్యర్‌ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement