టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
తిలక్ ప్రదర్శన ఇలా..
ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.
టాపార్డర్ నుంచి తీసేశారు!
అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.
ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.
16 బంతుల్లోనే
ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.
డౌన్ ఆర్డర్‌కు పంపడం మంచిదైంది
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్‌లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.
నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను.
ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.
చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్


