టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరం | T20 WC 2026: New zealand to take on england in their last super over match | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరం

Feb 27 2026 1:44 PM | Updated on Feb 27 2026 1:51 PM

T20 WC 2026: New zealand to take on england in their last super over match

టీ20 ప్రపంచకప్‌ 2026లో నేడు (ఫిబ్రవరి 27)  కీలక సమరం జరుగనుంది. గ్రూప్‌-2 నుంచి ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌.. మరో బెర్త్‌ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. తద్వారా పాక్‌ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

అదే ఇంగ్లండ్‌ గెలిస్తే సెమీస్‌ రెండో బెర్త్‌ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్‌, న్యూజిలాండ్‌ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. 

ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్‌ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌ రన్‌ రేట్‌ 3.050గా ఉంది. అదే పాక్‌ రన్‌రేట్‌ -0.461గా ఉంది. 

పాక్‌ మైనస్‌ నుంచి ప్లస్‌ రన్‌రేట్‌లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి,  నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా, న్యూజిలాండ్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. 

వాస్తవానికి న్యూజిలాండ్‌ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్‌తో జరగాల్సిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్‌ జరిగి ఉంటే, న్యూజిలాండ్‌ సునాయాసంగా పాక్‌ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునేది.

బలాబలాల ప్రకారం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సమతూకంగా కనిపించినా ఎడ్జ్‌ న్యూజిలాండ్‌వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. అదే ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌, జేకబ్‌ బేతెల్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్‌ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.

తుది జట్లు..
న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీ

ఇంగ్లండ్‌: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement