ప్రస్తుత రంజీ సీజన్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో ప్రత్యర్ది బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు.
కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఆట కట్టించాడు. ఈ క్రమంలో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే ఆలౌటై, జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు (584) చాలా వెనుకపడి పోయింది.
జమ్మూ బౌలర్లలో నబీతో పాటు సునీల్ కుమార్ (19-6-51-2), యుద్ద్‌వీర్ సింగ్ (14.3-3-55-2), సాహిల్ లోత్రా (12-1-50-1) సత్తా చాటారు. కర్ణాటక తరఫున ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరిపోరాటం చేసినా తన జట్టు పటిష్ట స్థితికి చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లభించలేదు. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (13), దేవ్‌దత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0), స్మరణ్ రవిచంద్రన్ (0) దారుణంగా విఫలమయ్యారు.
అంతకుముందు షుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీతో, యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధావన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో జమ్మూ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫైనల్‌కు చేరడంలో ఆకిబ్ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్‌కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో (క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ తొలి ఇన్నింగ్స్) నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు.. సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. నబీ ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీశాడు.
ఎలా ఎంపిక చేయరో చూస్తా..!
ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపిచినట్లైంది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబర్చిన నన్ను టీమిండియాకు ఎలా ఎంపిక చేయరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. స్వింగ్ బౌలింగ్‌లో దిట్ట.
ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్ రాహుల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత ప్రమాదకారో అర్దమవుతుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మేలు చేయాలని ఆశిద్దాం.


