కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ! | Ranji Trophy 2025-26 Final, Paras Dogra Fined For Heated Argument On-Field, JK 584 All Out And Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!

Feb 26 2026 2:58 PM | Updated on Feb 26 2026 3:47 PM

Ranji Trophy Final: Paras Dogra fined For headbutt incident JK 584 All Out

అనీశ్‌తో పారస్‌ గొడవ (PC: PTI)

రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ జట్టు అదరగొట్టింది. కర్ణాటక బౌలింగ్‌ను చితక్కొడుతూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. హుబ్లీ వేదికగా గురువారం నాటి మూడో రోజు ఆటను ఓవర్‌నైట్‌ స్కోరు 527/6తో మొదలు పెట్టిన కశ్మీర్‌.. మరో 57 పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది.

కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!
ఓపెనర్‌ యావర్‌ హసన్‌ (88), కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కన్హయ్య వాధవాన్‌ (70), సాహిల్‌ లోత్రా (72) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుభం పండిర్‌ (121) శతకంతో దుమ్ములేపాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఆట పరంగా అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా మంచి ప్రదర్శన కనబరిచిర పారస్‌ డోగ్రా.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బుధవారం కర్ణాటక ఫీల్డర్‌ను హెల్మెట్‌తో ఢీకొట్టాడు. రంజీ ట్రోఫీలో సీనియర్‌ ఆటగాడిగా అపార అనుభవం ఉన్న పారస్‌ డోగ్రా... కర్ణాటక ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.

పదే పదే కామెంట్‌
దేశవాళీల్లో 21వ సీజన్‌ ఆడుతున్న జమ్ముకశ్మీర్‌ సారథి... బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ అనీశ్‌తో గొడవకు దిగాడు. పారస్‌ సంయమనంతో షాట్‌లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ చేస్తున్న అనీశ్‌... పారస్‌ను పదే పదే కామెంట్‌ చేశాడు. దీంతో ప్రసిధ్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్‌... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.

హెల్మెట్‌తో ఢీకొట్టి
ఈ క్రమంలో అనీశ్‌ను పారస్‌ హెల్మెట్‌తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్‌ కూడా హెల్మెట్‌ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన కర్ణాటక సీనియర్‌ ప్లేయర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్‌ అంపైర్లు రోహాన్‌ పండిట్, ఉల్హాస్‌ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. 

భారీ షాకిచ్చిన బీసీసీఐ!
అయితే, ఈ వివాదం కారణంగా పారస్‌ డోగ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతక్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడికి భారీ జరిమానా విధించింది. ఈ విషయం గురించి.. మ్యాచ్‌ రిఫరీ నారాయణ్‌ కుట్టీ మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు. జమ్మూకశ్మీర్‌ సారథి పారస్‌ డోగ్రా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా రంజీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్‌ను ఫైనల్‌ చేర్చిన కెప్టెన్‌గా పారస్‌ డోగ్రా చరిత్రకెక్కాడు.

చదవండి: T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement