జమ్మూకశ్మీర్ జబర్దస్త్ ఆట
తొలి ఇన్నింగ్స్ 527/6
రాణించిన పారస్ డోగ్రా, కన్హయ్య, సాహిల్
ప్రసిధ్ కృష్ణకు మూడు వికెట్లు
కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ జట్టు అద్వితీయ ఆటతీరు కనబరుస్తోంది. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్న కర్ణాటకతో తుదిపోరులో జమ్మూ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 284/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 156 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (166 బంతుల్లో 70; 8 ఫోర్లు), కన్హయ్య వాధ్వాన్ (109 బంతుల్లో 70; 9 ఫోర్లు), సాహిల్ లోత్రా (93 బంతుల్లో 57 బ్యాటింగ్; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ప్లేయర్లంతా బాధ్యతాయుతంగా ఆడటంతో జమ్మూ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు శుభమ్ పుండిర్ (247 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (104 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. బుధవారం ఆట ప్రారంభమైన కాసేపటికే శుభమ్ అవుట్ కాగా... తదుపరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ సైతం పెవిలియన్ చేరాడు. ఈ దశలో తొలి రోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ పారస్ డోగ్రా క్రీజులోకి వచ్చాడు. సుదీర్ఘ అనుభవమున్న ఈ 41 ఏళ్ల బ్యాటర్... ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయాడు.
మరోవైపు నుంచి కన్హయ్య అతడికి చక్కటి సహకారం అందించాడు. ఈ జంట చాపకింద నీరులా పరుగులు రాబడుతుండటంతో... కర్ణాటక ప్లేయర్లలో అసహనం పెరిగిపోయింది. ఇది మైదానంలో స్పష్టంగా కనిపించింది. పలుమార్లు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో కన్హయ్య 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... పారస్ డోగ్రా 140 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐదో వికెట్‌కు 192 బంతుల్లో 110 పరుగులు జోడించిన అనంతరం కన్హయ్య వెనుదిరిగాడు.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన జమ్మూకశ్మీర్... కర్ణాటక బౌలర్లను మరింత అసహనానికి గురిచేసింది. ఆరో వికెట్‌కు పారస్, సాహిల్ కలిసి 75 బంతుల్లో 54 పరుగులు జోడించగా... అబేధ్యమైన ఏడో వికెట్‌కు అబిద్ ముస్తాక్ (20 బ్యాటింగ్; 2 ఫోర్లు)తో కలిసి సాహిల్ 56 పరుగులు జత చేశాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా... విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించిన జమ్మూకశ్మీర్ జట్టు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సాగుతోంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఆ జట్టు మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి.
స్కోరు వివరాలు
జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (సి) (సబ్) అనీశ్ (బి) విద్యాధర్ 121; పారస్ డోగ్రా (బి) శ్రేయస్ 70; అబ్దుల్ సమద్ (సి) కృతిక్ (బి) ప్రసిధ్ 61; కన్హయ్య (సి) రాహుల్ (బి) శిఖర్ 70; సాహిల్ (బ్యాటింగ్) 57; ఆబిద్ ముస్తాక్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 34; మొత్తం (156 ఓవర్లలో 6 వికెట్లకు) 527. వికెట్ల పతనం: 1–18, 2–157, 3–303, 4–307, 5–417, 6–471. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 29–2–104–1; విజయ్ కుమార్ వైశాఖ్ 31–10–60–0; ప్రసిధ్ కృష్ణ 29–7–90–3; శ్రేయస్ గోపాల్ 33–2–130–1; శిఖర్ షెట్టి32–1–112–1; కరుణ్ నాయర్ 2–1–1–0.
అదేం పెద్ద విషయం కాదు
ఫైనల్లో మా ప్లేయర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టు సమష్టిగా సత్తా చాటుతోంది. ప్రస్తుతానికి మా జట్టు మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో ఆమాత్రం కోపోద్రేకాలు సహజం. అనీశ్‌తో వాగ్వాదం అప్పటివరకు మాత్రమే. ఆ తర్వాత అంతా సాధారణమే. మేం తర్వాత మాట్లాడుకున్నాం కూడా.
కర్ణాటక జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. వారి ముందు లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశం లేదు. తొలి ఇన్నింగ్స్‌ను వీలైనంత వరకు కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మా ప్లేయుర్లు చక్కటి ఆటతీరు కనబర్చారు. ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో సాగుతాం. –పారస్ డోగ్రా, జమ్మూకశ్మీర్ కెప్టెన్
‘తల’పడ్డ పారస్,అనీశ్
కర్ణాటక ఫీల్డర్‌ను హెల్మెట్‌తో ఢీకొట్టిన జమ్మూకశ్మీర్ కెప్టెన్
రంజీ ట్రోఫీలో అపార అనుభవం ఉన్న పారస్ డోగ్రా... కర్ణాటక ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు. దేశవాళీల్లో 21వ సీజన్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ సారథి... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అనీశ్‌తో గొడవకు దిగాడు. పారస్ సంయమనంతో షాట్‌లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తున్న అనీశ్... పారస్‌ను పదే పదే కామెంట్ చేశాడు. దీంతో ప్రసిధ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో అనీశ్‌ను పారస్ హెల్మెట్‌తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్ అంపైర్లు రోహాన్ పండిట్, ఉల్హాస్ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. మ్యాచ్ అనంతరం జమ్మూకశ్మీర్ సారథి పారస్ డోగ్రా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ నారాయణ్ కుట్టీ వెల్లడించాడు.


