కర్ణాటక-జమ్మూ అండ్ కశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో హైటెన్షన్ చోటు చేసుకుంది. మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కేవీ అనీష్‌పై జమ్మూ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన జమ్మూ అండ్ కశ్మీర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఎడిషన్ ఆధ్యాంతం రాణించినట్లుగానే ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.
— crictalk (@crictalk7) February 25, 2026
షుభమ్ పుండిర్ (121) అద్భుత శతకంతో, అరంగేట్రం ఓపెనర్ యావెర్ హస్సన్ (88), అబ్దుల్ సమద్ (61) అర్ద శతకాలతో సత్తా చాటారు. ఫలితంగా జమ్మూ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (36), కన్హయ్య వధావన్ (45) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, రెండో రోజు ఆట ప్రారంభంలో కర్ణాటక బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, వైశాక్ విజయ్‌కుమార్, విద్యాధర్ పాటిల్ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు. ఫీల్డర్లు నిరంతరం స్లెడ్జింగ్ చేస్తూ డోగ్రాను రెచ్చగొట్టారు. 101వ ఓవర్‌లో డోగ్రా ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన తర్వాత, షార్ట్ ఫైన్ లెగ్‌లో నిలిచిన సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్ వైపు దూసుకెళ్లి, తన హెల్మెట్‌తో అతని తలపై కొట్టాడు. ఊహించని ఈ ఘటనతో మ్యాచ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
కర్ణాటక సీనియర్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వెంటనే జోక్యం చేసుకొని డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు ఉల్హాస్ గాంధే, రోహన్ పండిట్ గొడవను మరింత పెద్దది కాకుండా ఆటగాళ్లను వేరు చేశారు. కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఈ ఘటనను మ్యాచ్ రిఫరికి నివేదించాడు. ఈ ఘటనకు ముందు కూడా జమ్మూ ఆటగాళ్లు డోగ్రా, కన్హయ్య కర్ణాటక ఆటగాళ్లతో చాలాసార్లు వాగ్వాదానికి దిగారు. ఇది చివరికి ఘర్షణకు దారి తీసింది.


