ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది.
వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్‌కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.
తాజాగా ఎడిషన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్‌పై సూపర్-8 మ్యాచ్‌లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్‌కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది.
మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి.
గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు.
అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).
అంతకుముందు సాహిబ్‌జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.


