సచిన్‌ను ఎల్బీగా ప్రకటించడం తప్పే | Steve bucknor on sachin tendulkars out | Sakshi
Sakshi News home page

సచిన్‌ను ఎల్బీగా ప్రకటించడం తప్పే

Feb 25 2026 2:51 AM | Updated on Feb 25 2026 2:51 AM

Steve bucknor on sachin tendulkars out

22 ఏళ్ల తర్వాత అంగీకరించిన దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌  

న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుటివ్వడం ముమ్మాటికీ తప్పేనని వెస్టిండీస్‌ దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ అంగీకరించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేషానుభవం కలిగిన ఆయన 2009లో అంపైరింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 1989 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఐదు వన్డే ప్రపంచకప్‌లకు ఫీల్డ్‌ అంపైర్‌గా పనిచేశారు. తాజాగా 79 ఏళ్ల బక్నర్‌ రెండు దశాబ్దాల తర్వాత విండీస్‌ క్రికెట్‌ అంపైర్స్‌ అసోసియేషన్‌ ఇంటర్వ్యూలో తన పొరపాటును అంగీకరించారు. 

అంపైరింగ్‌ కెరీర్‌లోనే అది అత్యంత పేలవమైన నిర్ణయంగా చెప్పుకొచ్చారు. 2003–04లో ఆ్రస్టేలియా పర్యటనలో భారత్‌ ఆడిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ను వికెట్ల ముందు దొరికిపోయినట్లు (ఎల్బీడబ్ల్యూ)గా బక్నర్‌ ప్రకటించారు. కానీ రిప్లేలో బంతి వికెట్లకు దూరంగా పైనుంచి వెళుతున్నట్లు స్పష్టమైంది. దీనిపై అప్పటి మేటి టీవీ వ్యాఖ్యాత టోనీ గ్రెగ్‌ అంపైరింగ్‌లోనే అత్యంత చెత్త నిర్ణయమని ఘాటుగా వ్యాఖ్యానించారు.  

అసలు ఏమైందంటే... 
ఇది 22 ఏళ్ల క్రితం సంగతి. బ్రిస్బేన్‌లో భారత్, ఆసీస్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జాసన్‌ గిలెస్పీ వేసిన బంతిని సచిన్‌ డిఫెండ్‌ చేయబోగా అది అతని ప్యాడ్లను తగిలింది. వెంటనే బౌలర్, జట్టు సహచరులంతా ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అరుస్తూ అప్పీల్‌ చేశారు. ఫీల్డ్‌ అంపైర్‌ బక్నర్‌ అప్పీలుకు బదులుగా తన చేతి వేలు పైకెత్తాడు. ఎంతో అనుభవజ్ఞుడైన సచిన్‌కు బంతి గమనం బాగా గుర్తు. అది ఎల్బీడబ్ల్యూ కానేకాదని అతని గట్టి నమ్మకం అందుకే నిరాశగా వెనుదిరిగాడు. 

మరుసటి ఏడాది (2005) పాక్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లోనూ సచిన్‌ను తప్పుడు నిర్ణయంతో బక్నర్‌ పెవిలియన్‌కు పంపించారు. రజాక్‌ సంధించిన బంతి టెండూల్కర్‌ బ్యాట్‌ తగలకుండా ఫీల్డర్‌ చేతుల్లో పడింది. అప్పుడు క్యాచ్‌ అవుట్‌గా ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement