న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా నిలుస్తోంది. గ్లోబల్ జాబ్ పోర్టల్ ‘ఇన్‌డీడ్’ (Indeed) 12 దేశాల్లో నిర్వహించిన తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయ యజమానులు, అభ్యర్థులు ఏఐ వినియోగంపై అత్యంత సానుకూలత కనబరుస్తున్నారు.
బ్రిటన్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా అభ్యర్థులు ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడేందుకు విముఖత చూపుతుండగా, భారత్‌లో కేవలం 5 శాతం మంది యజమానులు, 8 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ సాంకేతికతకు దూరంగా ఉండటం గమనార్హం. గత దశాబ్ద కాలంలో భారత్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ విద్య వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా స్వీకరించడంతో ఏఐ అనేది ఒక అడ్డంకిలా కాకుండా అవకాశాలను మెరుగుపరిచే ఒక సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.
నియామక ప్రక్రియలో ఏఐ ప్రవేశం కేవలం ఒక మార్పు మాత్రమే కాదని, అది అపారమైన వేగాన్ని ఇస్తుందని భారత్‌లోని పలు సంస్థలు నమ్ముతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను వడపోసి, సరైన అభ్యర్థులను గుర్తించడంలో ఏఐ ఒక అద్భుతమైన ‘ఎనేబులర్’గా పనిచేస్తోంది. అయితే ఈ సాంకేతికత స్క్రీనింగ్, మ్యాచింగ్‌కు మాత్రమే పరిమితం కావాలని, తుది నిర్ణయం మాత్రం మానవ మేధస్సుతోనే జరగాలనే ఒక అప్రకటిత ఒప్పందం యజమానులకు, అభ్యర్థులకు మధ్య కొనసాగుతోంది.
మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ పునీత్ చందోక్ అంచనా వేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో ఏఐ ఉద్యోగాలను హరించడం కంటే సృష్టించడమే ఎక్కువగా ఉంటుందనే ధీమా భారత మార్కెట్లో కనిపిస్తోంది. భారీ జనాభా, తీవ్రమైన పోటీ ఉన్న భారతదేశంలో నియామకాల్లో జరిగే గందరగోళాన్ని తగ్గించడానికి ఆటోమేషన్ ఒక ఒక అనివార్యమైన అవసరంగా మారింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు కేవలం 'కీ వర్డ్స్' ఆధారంగా ప్రొఫైల్స్ ఎంపిక చేస్తున్నాయని, అభ్యర్థిలోని ప్రతిభను, అనుభవాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏఐ ఏజెంట్స్ అల్గారిథమ్స్ నమూనాలను మాత్రమే గుర్తించగలవు కానీ, ఒక వ్యక్తిలోని పట్టుదలను, సృజనాత్మకతను అంచనా వేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఏఐని స్వీకరించడంలో ముందున్నప్పటికీ, నియామకాల్లో పారదర్శకత, వివక్ష లేని అల్గారిథమ్స్, పటిష్టమైన పర్యవేక్షణ మార్గదర్శకాలు అత్యవసమని చెబుతున్నారు. సాంకేతికతను వాడుకోవడమే కాకుండా, దాన్ని ఎంత నైతికంగా అమలు చేస్తున్నామనేదే భారత్ ముందున్న అసలైన సవాలని నిపుణులు అంటున్నారు. నియామక ప్రక్రియలో మానవత్వపు విలువలను కోల్పోకుండా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే భారత్ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికా: మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన జనజీవనం


