శశికళ సంచలన ప్రకటన | Sasikala hints at new party on Jayalalithaas birthday | Sakshi
Sakshi News home page

శశికళ సంచలన ప్రకటన

Feb 24 2026 11:02 AM | Updated on Feb 24 2026 11:14 AM

Sasikala hints at new party on Jayalalithaas birthday

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు  వీకే శశికళ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శశికళ.. త్వరలోనే ఒక శుభవార్త వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

జయలలిత మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత  కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

2026 ఎన్నికల్లో శశికళ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటముల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే కూటమి ‘ద్రవిడ మోడల్ 2.0’ నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా, బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది.

వీరికి తోడు స్టార్ హీరో విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో ఎన్నికల బరిలో నిలవడం ఈసారి పోటీని బహుముఖంగా మార్చేసింది. గత 2021 ఎన్నికల్లో డీఎంకే కూటమి 159 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, అప్పట్లో ఏఐఏడీఎంకే 66 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో శశికళ కొత్త పార్టీ ఆలోచన కార్యరూపం దాల్చితే, అది ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందనే అంశం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: తరచూ ఫోన్ చూస్తున్నారా?.. డేంజర్‌లో పడినట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement