జన నాయగన్‌పై సుప్రీం విచారణ ఎప్పుడంటే.. | Jana Nayagan Movie censor court hearing this date | Sakshi
Sakshi News home page

జన నాయగన్‌పై సుప్రీం విచారణ ఎప్పుడంటే..

Jan 14 2026 8:52 AM | Updated on Jan 14 2026 8:52 AM

Jana Nayagan Movie censor court hearing this date

తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్‌ విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీన విచారణ చేపట్టనుంది. సినిమాకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) క్లియరెన్స్‌పై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాత సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అయితే, కేసు విచారణ చేపట్టే సుప్రీం ధర్మాసనం ఖరారు కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగేందుకు, విజయ్‌ నటించిన చిట్ట చివరి సినిమాగా జన నాయగన్‌ను భావిస్తున్నారు. 

ఈ మేరకు 9వ తేదీన  విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్‌సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. సీబీఎఫ్‌సీకి వాదనను వినిపించుకునే అవకాశం ఏకసభ్య ధర్మాసనం ఇవ్వలేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.  

కేంద్రమే అడ్డుకుంటోంది: రాహుల్‌
టీవీకే చీఫ్‌ విజయ్‌ నటించిన జన నాయగన్‌ సినిమా విడుదలను కేంద్రమే అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దీనిని ఆయన తమిళ సంస్కృతిపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. తమిళ వాణిని అణచివేయాలని చూస్తే ప్రధాని మోదీ ఎన్నటికీ విజయం సాధించలేరన్నారు. విజయ్‌ నటించిన జన నాయగన్‌ సినిమాపై వివాదం తలెత్తిన వేళ ఎక్స్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్‌ సినిమాను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్డుకోజూడటం తమిళ సంస్కృతిపై దాడే. మిస్టర్‌ మోదీ, తమిళుల గొంతు నొక్కాలని చూస్తే ఎన్నటికీ విజయం సాధించలేరు’అని రాహుల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement