శంకరాభరణం @ 46 ఏళ్ళు
సంప్రదాయ సంగీతం నేర్చుకోవడానికి కొన్ని వందల మందిని మళ్ళీ ్ర పోత్సహించి, గురుశిష్య బంధమనే హృద్యమైన అంశాన్ని పవిత్రంగా చెప్పిన వెండితెర కావ్యం అది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లాంటి సుప్రసిద్ధ సంగీత, నృత్య విద్వన్మణుల మొదలు రాజ్‌కపూర్ లాంటి సినీ దిగ్గజాల దాకా అందరినీ ఆకట్టుకున్న కళాఖండం అది. చివరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మికవేత్తలు సైతం అందులోని ఆధ్యాత్మిక నిగూఢార్థాలపై ప్రవచనం చెప్పిన అపూర్వ గౌరవం దక్కించుకున్న చిత్రరాజం అది.
వెరసి, నాలుగున్నర దశాబ్దాలు దాటినా... నేటికీ తెలుగు సినీ ఆణిముత్యాలంటే ముందు వరుసలో చెప్పుకొనే అరుదైన సినిమా ‘శంకరాభరణం’. అలాంటి ‘శంకరాభరణం’ రూపకల్పన యజ్ఞం గురించి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు – రచయిత వంశీ ఆ సినిమా తొలి రిలీజ్ సమయంలోనే వెండితెర నవల రాశారు. చాలా కాలంగా అందుబాటులో లేని ఆ నవల కె. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఇటీవలే మరోమారు కొత్త హంగులతో జనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ‘శంకరాభరణం’లోని అనేకానేక విశేషాల్లో కొన్ని...
అది 1980... మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్‌రోడ్‌లో అణ్ణా ఫ్లై–ఓవర్ సమీపంలోని సత్యం థియేటర్ కాంప్లెక్స్... అందులో ఒక సినిమా అప్పటికి 20 వారాలుగా విశేష జనాదరణతో ఆడుతోంది. అయినా సరే కొత్త రిలీజ్ సినిమా చూసేందుకు వస్తున్నట్లుగా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్‌స్టార్ సినిమానో కాదు.
ఆ మాటకొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ,పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం... ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష,ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. అలా తమిళ ప్రేక్షకులే కాదు... కన్నడ, మలయాళ ప్రేక్షకులూ నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా... ప్రపంచమంతటా తెలుగువాడు ఇవాళ్టికీ శిరసెత్తి గర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా... ‘శంకరాభరణం’.
తెలుగులోనే... తమిళ, మలయాళ సీమల్లోనూ!
ఆ సినిమాలో కథానాయకుడు శంకరశాస్త్రిపాత్ర వయసు అరవైకి దగ్గర! కీలకపాత్ర పోషించిన నర్తకి అప్పటికి వ్యాంప్ వేషాలేస్తున్న నటి. సినిమాలో డ్యూయెట్లు లేవు... ఫైట్లూ లేవు. పైగా అంతా సంగీతం... అదీ సంప్రదాయ సంగీతం! కానీ,ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా భాషల ఎల్లలు దాటి దశాబ్దాల పైచిలుకు క్రితమే దేశాన్ని జయించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకతో సహా అన్నిచోట్లా తెలుగులోనే రజతోత్సవాలు జరుపుకొని, ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది.
అది దర్శకుడు కె. విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ఇంకా మహదేవన్, వేటూరి, ఎస్పీబీ, వాణీజయరామ్, బాలూ మహేంద్ర లాంటి ఎందరెందరో కళా ఋషుల తపఃఫలం.ఆ తెలుగు సినీ కళాఖండంలోని మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి,పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళ రాష్ట్రంలో 25 వారాలు ఆడింది.
పంపిణీదారులకు లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టింది. మాటల్ని మాత్రం అనువాదం చేసి,పాటలను మాత్రం మాతృకలోవే యథాతథంగా ఉంచేసి ఒక సినిమాను విడుదల చేసిన చరిత్ర మరెక్కడాలేదు. అది మరో ఘనత. వెరసి, తెలుగు, తమిళ, మల యాళ సినీరంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టం ‘శంకరాభరణం’.
అసలు హీరోలు... ఆ ఇద్దరే!
చిన్న చిత్రాల పెద్ద హీరో చంద్రమోహన్ మినహా స్టార్లే లేని సినిమా ‘శంకరాభరణం’. ఈ సెల్యులాయిడ్ భగీరథ ప్రయత్నంలో సంగీతం, సాహిత్యాలే హీరోలని విశ్వనాథ్‌కు తెలుసు. అందుకే, సినిమాకు శ్రీకారం చుడుతూ,పాటల కం పోజింగ్ ప్రారంభమైన రోజునే గీత రచయిత వేటూరినీ, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్‌నూ చూసి ఒకటే చెప్పారు. ‘నా కథలో హీరో అరవై ఏళ్ళ వృద్ధుడు. గ్లామర్ ఏ మాత్రం లేనివాడు. గ్లామరస్ హీరోయిన్ లేదు. డ్యూయట్లు, ఫైట్లు... అసలే లేవు. నాకున్నదల్లా మీరిద్దరే. మిమ్మల్ని చూసి, నేను ఈ ధైర్యం చేస్తున్నాను’ అంటూ దేవుడి పటం దగ్గర ఉన్న కొబ్బరికాయలు వేటూరి, మహదేవన్‌ల చేతికి ఇచ్చారు. స్వయంగా విశ్వనాథ్ తండ్రి – జ్యోతిశ్శాస్త్ర పండితుడైన కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెట్టిన ఆ మహత్తర ముహూర్త వేళావిశేషం... సినిమాకు అద్భుతమైన సాహిత్యం, సంగీతం అమరాయి.
ఈ సంగీత ప్రధాన చిత్రం తాలూకు ఇతివృత్తం వగైరా తెలుసు గనక, నిర్మాతల్లో ఒకరైన ఏడిద నాగేశ్వరరావు తోడల్లుడు ఆకాశం శ్రీరాములు గారి భార్య తమ ఇంట్లో ప్రాచీన సంప్రదాయ కీర్తనలు రాసుకున్నపాత నోట్ పుస్తకం తీసి, దర్శకుడు విశ్వనాథ్‌కు ఇచ్చారు. తీస్తున్న సబ్జెక్ట్ మీద అభిరుచి గల నిర్మాతలు, వారి కుటుంబాలు సైతం ఎంతగా తపించేవో చెప్పడానికి అదో మచ్చుతునక. మొత్తానికి ‘ఏ తీరుగ నను...’ – ‘పలుకే బంగారమాయెనా...’ లాంటి రామదాసు కీర్తనలు, ‘మానస సంచరరే...’ లాంటి సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, ‘బ్రోచేవారెవరురా...’ లాంటి మైసూరు వాసుదేవాచార్య కీర్తనలు, ఆ మహత్తర సంప్రదాయ కీర్తనలకు దీటుగా నిలిచేలా సినిమాకు వేటూరి రాసిన ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే...’, ‘శంకరా నాద శరీరాపరా...’ – ఇలా ప్రతిదీ ఆణిముత్యమే.
ఆమె ఇమేజ్‌ను మార్చేసిన ఆపాత్ర!
అప్పటి దాకా వ్యాంప్ తరహాపాత్రలకే పరిమితమైన మంజుభార్గవిని ‘శంకరాభరణం’లోని పవిత్రమైన తులసిపాత్రకు ఎంచుకోవడం విశ్వనాథ్ చేసిన విచిత్ర సాహసమే. మొదట ఆపాత్రకు హీరోయిన్ జయప్రదను అనుకున్నా, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. జ్యోతి అనే మరో అమ్మాయిని ఎంపిక చేసినా, అదీ కుదరలేదు. చివరకు మేకప్‌లేని మంజుభార్గవి స్టిల్స్ తెప్పించుకొని, ప్రారంభ పరీక్షల అనంతరం ఆమెను తులసిపాత్రకు ఎన్నుకున్నారు. అంతకు ముందు ధరించిన తరహాపాత్రలను ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాణ కాలంలో అంగీకరించవద్దని విశ్వనాథ్ ఆమెకు చెప్పారు. అలాగే, ఆమె ఆ షూటింగ్ సమయంలో 20 అవకాశాలొచ్చినా నో చెప్పారు.
తీరా, సరిగ్గా ‘శంకరాభరణం’ విడుదల రోజునే అక్కినేని ‘నాయకుడు– వినాయకుడు’ రిలీజైంది. ఒకపక్క ‘శంకరాభరణం’లో పరమ పవిత్రమైన తులసిపాత్ర పోస్టర్లు. ఎదురుగా ఉన్న మరో థియేటర్‌లోనేమో... శృంగారభంగిమల్లో మంజుభార్గవి పోస్టర్లు. అదీ పరిస్థితి. ‘శంకరాభరణం’ యూనిట్ మొదట కంగారుపడ్డా, ఆఖరికి శృంగారం కన్నా సంగీతమే బంగారమైంది. జనం తులసిదళం వైపే తూగారు. అక్కడ నుంచి మంజు ఇమేజే మారి పోయింది.
విశ్వనాథ్ వెండితెర విశ్వరూపం
శంకరశాస్త్రిపాత్రధారి జె.వి. సోమయాజులు, తులసిపాత్రధారిణి మంజుభార్గవి, ఆత్మీయ మిత్రుడిపాత్రలో అల్లు రామలింగయ్య మొదలు ‘శంకరాభరణం’ నటీనటులందరికీ పట్టరానంత పేరొచ్చింది. శంకరశాస్త్రి కుమార్తె శారదగా నటించిన హీరోయిన్ రాజ్యలక్ష్మికైతే ఇప్పటికీ ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మిగానే పేరు, గుర్తింపు. గాయనీ గాయకులు, సంగీత దర్శకుడు... ఇలా టెక్నీషియన్ల సంగతైతే చెప్పనే అక్కరలేదు. అందరికీ అంత పేరొచ్చినా... దానికి మూలకారకుడు దర్శకుడు కె. విశ్వనాథే. నిజానికి, ‘శంకరాభరణం’ పూర్తిగా డైరెక్టర్స్ ఫిల్మ్. ప్రతి సన్నివేశాన్నీ ముందే క్షుణ్ణంగా ఊహించుకొని, మనసులో రూపకల్పన చేసుకొని, దాన్ని అద్భుతంగా చిత్రీకరించిన గొప్పదనం విశ్వనాథ్‌ది.
విశ్వనాథ్ అంతకు ముందు మంచి చిత్రాలు అందించక పోలేదు. బాక్సాఫీస్ హిట్లూ తీయక పోలేదు. దర్శకులలో ప్రముఖుడిగా ప్రఖ్యాతి ΄÷ందక పోలేదు. కానీ, ‘శంకరాభరణం’ వాటన్నింటినీ అధిగమించి మరో కొత్త మైలురాయిని నాటింది. అసలు కేవలం శాస్త్రీయ సంగీత కళను కథావస్తువుగా తీసుకొని, చిత్రంగా మలచాలనుకోవడమే సాహసం. అంతటి సాహసంలోనూ, నిర్మాతకు కీర్తితోపాటు బాక్సాఫీస్ కనకాన్నీ సాధించి పెట్టడం విశ్వనాథ్ మాత్రమే చేసిన అరుదైన విన్యాసం. మాస్ ప్రేక్షకుల హృదయాన్ని కూడా క్లాస్ ప్రేక్షకుల రసహృదయ స్థాయికి తీసుకువెళ్ళిన విశ్వనాథ్ వెండితెర మ్యాజిక్ ‘శంకరాభరణం’. తారలే స్టార్లు కాదనీ, కథాసంవిధానమే అసలైన స్టారని నిరూపించారు.
దశాబ్దాల తర్వాత తమిళంలో
‘శంకరాభరణం’ తొలిసారి రిలీజైన దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత... మళ్ళీ అదే మద్రాసు. 2015 మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో వచ్చింది. తెలుగు నుంచి తమిళంలోకి అనువదించిన మాటలు,పాటలతో వచ్చింది! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో తమిళనాట థియేటర్లలో డిజిటైజ్డ్ వెర్షన్‌గా రిలీజైంది! అలా మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత ఒక భాష నుంచి మరో భాష డబ్బింగైన సినిమాగా మళ్ళీ చరిత్రకెక్కింది.
కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్‌లోకి మార్చడం, డిజిటల్ వెర్షన్‌లోకి మార్చి విడుదల చేయడం అప్పటికే జరిగాయి. కానీ, అలా అన్ని దశాబ్దాల తరువాత ఒక క్లాసిక్... మరో భాషలోకి అనువాదమవడం విశేషం. అదీ మాతృక విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగ్ చేసి విడుదల చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా జరగలేదు.
అన్నేళ్ళ తర్వాతా... ఆ గాయకులే!
అంతేకాదు... తెలుగు మాతృకలోపాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ అన్నేళ్ళ తరువాత అవేపాత్రలకు తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లోనూపాటలుపాడించారు. 33 ఏళ్ళ వయసులో ఉండగా తెలుగులో ఆపాటలుపాడి, రికార్డ్ చేసిన ఎస్పీబీ సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో మళ్ళీ తమిళంలో ఆ గీతాలు ఆలపించి, ఆశ్చర్యపరిచారు. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో అందరూ దాదాపుపారితోషికం తీసుకోకుండానే ‘శంకరాభరణం’ తమిళ అనువాద గీతాలనుపాడారు.
ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రింట్!
భాష తెలియక పోయినా, తెలుగు ‘శంకరాభరణం’కి తమిళనాట ఒకప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంఘం)లో నటుడు ‘మేజర్’ సౌందరరాజన్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. హీరోలు శివాజీగణేశన్, శివకుమార్ సహా ఎంతో మంది కోసం ఎన్ని ప్రత్యేక ప్రదర్శనలు వేశారో లెక్క లేదు.
తెలుగు ‘శంకరాభరణం’ ఇద్దరు ప్రసిద్ధ తమిళ నటుల్ని సినీ పంపిణీదారులుగా కూడా మార్చేసింది. ‘‘సినిమా విపరీతంగా నచ్చిన నటుడు ‘మేజర్’ సౌందరరాజన్, నటి మనోరమతో కలసి మద్రాస్‌తో సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపిణీ హక్కులు కొన్నారు. అది ఒక విశేషం.
కోట్ల విలువైన ఆ ‘గోల్డెన్ డిస్క్’ ఆల్బమ్
అప్పట్లో పండితుల నుంచిపామరుల దాకా ‘శంకరాభరణం’లోనిపాటలు విననివారు, కూనిరాగం తీయనివారు అరుదు. ఆ రోజుల్లోనే ఆ సినిమాపాటల క్యాసెట్లు మన దేశంలో వేలసంఖ్యలో అమ్ముడై, గోల్డెన్ డిస్క్ సాధించింది. ఆ సందర్భంగా సభకు కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి హాజరై, ఆ జ్ఞాపికను నిర్మాతకు అందజేశారు. ఆ రోజుల్లో స్వల్ప మొత్తానికే విక్రయించిన ఈ చిత్రం ఆడియో హక్కులు ఇవాళైతే, కొన్ని లక్షలు కాదు... కోట్లు విలువ చేసేదని సినీ సంగీత వ్యాపార వర్గాల మాట.
వందేళ్ళ పని... ఒక్క సినిమా చేసింది!
తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎమ్జీయార్‌తోపాటు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పద్మా సుబ్రహ్మణ్యం, చిత్రా విశ్వేశ్వరన్ లాంటి సంప్రదాయ సంగీత, నృత్య దిగ్గజాలందరూ మద్రాసులో ‘శంకరాభరణం’ అభినందన సభకు హాజరయ్యారు. ఆ సభలో సాక్షాత్తూ సెమ్మంగుడి మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్ని ్ర పోత్సహించడానికి నూరేళ్ళుగా మా ‘మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ’ చేస్తున్న కృషికి సమానమైన కృషిని ఈ ఒక్క సినిమా చేసింది’’ అని ప్రశంసించారు.
అడిగితే చేసేవాడినన్న ఎన్టీఆర్!
ఎప్పుడో ‘సిరిసిరిమువ్వ’ షూటింగ్ కోసం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బోగీల కుదుపులో నిద్ర పట్టని వేళ దర్శక – రచయిత కె. విశ్వనాథ్ మనసుకు తట్టిన ‘శంకరాభరణం’ కథాబీజం చివరకు ఆ స్థాయికి చేరుతుందని ఆయన కూడా ఊహించలేదు. శంకరశాస్త్రిపాత్రకు మొదట అక్కినేని, కృష్ణంరాజు నుంచి శివాజీ గణేశన్ దాకా పలువురి పేర్లు చర్చకు వచ్చినా, చివరకు ఏ ఇమేజ్ లేని రంగస్థల నటుడు సోమయాజులుతో కథ తెరకెక్కింది. రక్తి కట్టింది. ప్రపంచమంతా పరవశాన శిరసూపిన ‘శంకరాభరణం’ని నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సహా ఎందరెందరికో దర్శక, నిర్మాతలు దగ్గరుండి మరీ చూపించారు. అగ్ర హీరో ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా ్ర΄÷జెక్షన్ వేశారు. ఎన్టీఆర్ లోని అచ్చమైన కళాకారుడు పరమానంద భరితుడయ్యారు. అంతేకాదు... ‘డ్యూయెట్లు, గ్లామర్ లేని శంకరశాస్త్రిపాత్రకు ధైర్యం చేయలేక, మీరు నన్ను అడగలేదు కానీ అడిగి ఉంటే తప్పకుండా నేనే చేసేవాణ్ణి’ అన్నారు ఎన్టీఆర్.
మనవాడున్నా మనకే అన్యాయం!
‘శంకరాభరణం’ రిలీజైన 2 నెలలకు ఏప్రిల్‌లో నేషనల్ అవార్డుల ప్రకటన జరిగింది. 1980లో రిలీజైనప్పటికీ, నిర్మాణం – సెన్సారింగ్ అంతకు ముందు ఏడాదే పూర్తవడంతో 1979 అవార్డులకు ఈ సంగీత ప్రధాన చిత్రమూ పోటీ పడింది. ఆ 27వ జాతీయ అవార్డుల్లో ఆ ఏటి ఉత్తమ చిత్రంగా ఒరిస్సాలో రూ΄÷ందిన తొలి హిందీ సినిమా ‘శో«ద్’ స్వర్ణకమలం సాధించింది.
ఒరిస్సాలో ఓ గ్రామంలో దారిద్య్రం, దోపిడీ, మూఢనమ్మకాలపై పోరాడే యువకుడి కథ అది. ‘శంకరాభరణం’కి ‘అత్యధిక ప్రజాదరణ, పూర్తిస్థాయి వినో దం, కళాత్మక విలువలు నిండిన’ చిత్రంగా స్వర్ణకమలం వరించింది.
జాతీయ అవార్డులు మొదలయ్యాక, ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక తెలుగు సినిమా ‘స్వర్ణకమలం’ సాధించడం అదే ప్రప్రథమం. అది సంతోషకరమే. అయితే, విచిత్రం ఏమిటంటే... ఆసారి జ్యూరీకి సారథి సాక్షాత్తూ తెలుగు దర్శక, నిర్మాత ఎల్.వి. ప్రసాద్. అయినప్పటికీ, కారణాలేమో కానీ అన్ని అర్హతలూ ఉన్న ‘శంకరాభరణం’ కన్నా ఓ సాధారణ హిందీ చిత్రానికి ఆయన జ్యూరీ పెద్ద పీట వేయడం శోచనీయం. మరిచి పోలేని అన్యాయం.
అప్పుడు ‘శంకరాభరణం’... ఇప్పుడు ‘బాహుబలి’!
అయితే, సినిమాల్లో సంగీత విభాగానికి ఇచ్చే మొత్తం 3 జాతీయ అవార్డులూ (సంగీత దర్శకుడు, గాయ కుడు, గాయని) ఆసారి ‘శంకరాభరణ’మే గెలుచుకుంది. ఆ ఏటి రాష్ట్ర అవార్డుల్లో 7 నందులతో (ఉత్తమ చిత్రం, గీత రచయిత, గాయకుడు, గాయని, సంగీత దర్శకుడు, బాలనటి, ద్వితీయ ఉత్తమ కథారచయిత) ‘శంకరాభరణం’కి పంట పండింది. ఇక ప్రైవేట్ పురస్కారాలు లెక్కే లేదు.
‘శంకరాభరణం’ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2015 నాటి సినిమాలకు ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి–1’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. తొలిసారిగా పూర్తిస్థాయిలో తెలుగు సినిమాకు ఆ గౌరవం తెచ్చింది. ‘శంకరాభరణం’ తర్వాత రెండోసారి స్వర్ణకమలం సాధించిన మనసినిమా అయింది.
బాక్సాఫీస్ తుపాను!
కొనుగోలుదారులు లేక రిలీజు కోసం నానా అవస్థలు పడిన ‘శంకరాభరణం’... తీరా రిలీజయ్యాక ఓ హిస్టీరియా. 19 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో, సికింద్రాబాద్‌లోని మంజు థియేటర్‌లో నూన్‌షోలతో... వెరసి 20 కేంద్రాల్లో రిలీజైన సినిమా అన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బళ్ళారి, ఖమ్మం కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం తర్వాత థియేటర్లలో నుంచి తీసివేయగా, మిగిలిన 18 సెంటర్లలోనూ (16 కేంద్రాల్లో రెగ్యులర్ షోలు, 2 కేంద్రాల్లో నూన్‌షోలు) శతదినోత్సవం జరుపుకొంది. ఆ అఖండ విజయం అంతటితో ఆగలేదు.
9 కేంద్రాల్లో సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. (విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాదుల్లో డైరెక్ట్‌గా, కాకినాడలో షిఫ్టులతో, గుంటూరు, రాజమండ్రి, సికింద్రాబాద్, అనంతపురంలో నూన్‌షోలతో ఆ ఘనత సాధించింది). విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పేరొందిన రాయల్ థియేటర్‌లో 216 రోజులు ఆడింది. ఇక, హైదరాబాద్‌లోనే షిఫ్టులతో 350 రోజులు (గోల్డెన్ జూబ్లీ) ప్రదర్శితమైన ఘనత ‘శంకరాభరణం’ది.
స్టార్లు లేకుండా... తొలి కోటి రూపాయల సినిమా!
‘శంకరాభరణం’ రిలీజైన రెండో వారం నుంచే అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలుగునాట అంతటా, అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను 15 శాతం పైగా పెంచింది. అనుకోకుండా పెరిగిన ఆ రేట్లు ఈ సంగీత భరిత చిత్రాన్ని కొనుగోలు చేసిన పంపిణీదారులకు కాసుల వర్షంలో కలిసొచ్చాయి. తెలుగు సినీ చరిత్రలో అప్పటి దాకా ఎన్టీఆర్ లాంటి అగ్రహీరో సినిమాలే కోటి రూపాయల వసూళ్ళు సాధించాయి. ఎన్టీఆర్ సినిమాలు ఏడింటిæ (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘ఛాలెంజ్ రాముడు’) తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా ‘శంకరాభరణ’మే! అగ్ర హీరోలెవరూ లేకుండానే ఓ సంగీతభరిత చిత్రం అంత వసూలు చేయడం అపూర్వమైన రికార్డు.
నలభై ఆరేళ్ళ తర్వాత... అదే నవల
ఇవాళ సుప్రసిద్ధుడైన కథా రచయిత – దర్శకుడు వంశీ అప్పట్లో సినీ రంగానికి కొత్త కుర్రాడు. దర్శకుడు కె. విశ్వనాథ్ వద్ద ఈ చిత్రానికి సహాయ దర్శకులలో ఒకరిగా పనిచేసిన నవ యువకుడు. అప్పటికే నవలలు రాసిన అనుభవం, అద్భుతమైన భావుకత వంశీ సొంతం. సినిమా హిట్టవడంతో, వెండితెర నవల వేయాలనే యోచన వచ్చింది. వంశీ ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించారు. సినిమా కథనూ, సన్నివేశాలనూ కళ్ళకు కట్టినట్టుగా నవల రూపంలో అందించారు. అంతేకాక, షూటింగ్ విశేషాలనూ కళ్ళకుకట్టేలా ఇచ్చారు.
చిత్రాన్ని నిర్మించిన పూర్ణోదయా సంస్థ వారే ఈ వెండితెర నవలను సైతం జనం ముందుకు తెచ్చారు. నయాపైసాపారితోషికం తీసుకోకుండా బాపు గీసిన బొమ్మతో అందంగా తయారైన ఆ వెండితెర నవల తెగ అమ్ముడైంది. ఒకటికి మూడు ముద్రణలు ΄÷ందింది. ఆ నవల రాసినందుకు ఆ రోజుల్లోనే తనకు వెయ్యి రూపాయలుపారితోషికం ఇచ్చినట్టు వంశీ ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటారు. చాలా కాలం అందుబాటులో లేని ఆ వెండితెర నవలను తాజాగా దర్శకుడు విశ్వనాథ్ పెద్ద కుమారుడు నాగేంద్రనాథ్ సహకారంతో, వంశీ మరింత కొత్త అందాలతో అపురూపంగా తీసుకొచ్చారు.
సినిమాకు కావ్య గౌరవం... ఆధ్యాత్మిక ప్రవచన పర్వం...
అందరినీ ఆకట్టుకున్న కళాఖండం ‘శంకరాభరణం’పై కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు 2016 ఆగస్టులో 3 రోజులపాటు ప్రవచనం చెప్పడం విశేషం. ఒక సినిమాపై ఒక సరస్వతీపుత్రుడు, ఆధ్యాత్మికవేత్త ప్రవచన రూపంలో విశ్లేషణ చేయడం సినీ చరిత్రలో అదే తొలిసారి. ఏమైనా, ఇవాళ్టికీ ‘శంకరాభరణం’లోని ప్రతి మాట, ప్రతిపాట, ప్రతిపాత్ర, ప్రతి దృశ్యం, ప్రతి అణువు... ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. అంత గొప్పగా రూ΄÷ందించారు గనకనే... ‘శంకరాభరణం’ దర్శకుడిగా విశ్వనాథ్ విశ్వరూపం.
ప్రముఖ రచయిత – జర్నలిస్టు రెంటాల గోపాలకృష్ణ అప్పట్లో అభి్రపాయపడినట్టు, ‘‘ఆ చిత్ర నిర్మాణ సమయంలో సాక్షాత్తూ శంకరుడో, లేక వాగ్దేవి సరస్వతీదేవో విశ్వనాథ్‌ను ఆవహించి ఉండాలి. అందుకే, ఆ చిత్రం ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లు రూ΄÷ందింది. సామాన్య నటీనటులతో ఇంతటి అసామాన్యమైన చిత్రాన్ని నిర్మించడం తేలికైన పని కాదు.’’ ఇవాళ చూసినా ఆద్యంతం అదే అనుభూతినిచ్చే ‘శంకరాభరణం’ విషయంలో అది అక్షరసత్యం.
భాషల ఎల్లలు దాటిన... తెలుగు మాట,పాట!
⇒టాకీలు వచ్చిన కొత్తల్లో 1930లు, ’40లలో మన తెలుగు సినిమాలు తమిళ, మలయాళ సీమల్లో బాగా ఆడేవి. కానీ, ఏ హీరోలకు ఆ హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (మౌంట్‌రోడ్‌లోని సఫైర్)లో, ఉదయం ఆటలతో 596 రోజులు ఆడి, ఇప్పటికీ రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత... తెలుగునాట విడుదలైన కొద్ది రోజులకు చెన్నపట్నానికి వెళ్ళిన ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడంతటా బాగా ఆడింది. రిపీట్ రన్‌లు సరే సరి!
⇒ మలయాళ సీమ సంగతికొస్తే... ‘ఏ.వి.ఎం’ స్టూడియో అధినేత మెయ్యప్ప చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు ఈ సినిమా హక్కుల్ని నటి మనోరమ వాళ్ళ నుంచి కొనుగోలు చేశారు. తెలుగు ‘శంకరాభరణం’ డైలాగుల్ని మాత్రం మలయాళంలోకి మార్చి,పాటల్ని యథాతథంగా తెలుగులోనే ఉంచి, రిలీజ్ చేశారు. తెలుగుపాటలతోనే కేరళలోనూ సినిమా పెద్ద హిట్. అక్కడి మైకుల్లో ‘శంకరా నాదశరీరాపరా...’ లాంటి మన తెలుగుపాటలు మారుమోగాయి. ఆర్థికంగా దెబ్బతిన్న ఆ డిస్ట్రిబ్యూటర్ కేవలం లక్షా 75 వేలకు హక్కులు కొంటే, ఆ రోజుల్లో కోట్లలో లాభం వచ్చింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, ఆయన గుండె పోటుతో మరణించారు.
⇒ ఆడియో గ్రామఫోన్లు, క్యాసెట్లు పోయి సీడీలు అమ్మే రోజులు వచ్చిన తర్వాత కూడా మలయాళ భాషలో ఇన్‌లే కార్డు వివరాలతోనే ‘శంకరాభరణం’ తెలుగుపాటల సీడీలు కేరళలో జోరుగా అమ్ముడవుతూ వచ్చాయి. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మార్గమంతటా మన ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి.
⇒ కన్నడ సీమలోనూ... ఒక్క బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో (4 హాళ్ళలో నేరుగా, 2 హాళ్ళలో ఉదయం ఆటలతో) తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. అది ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు. ఒక సంగీత ప్రధానమైన మన సినిమా ఒక్క తెలుగులోనే కాక, ఇలా దక్షిణాది అంతటా నాలుగు భాషాప్రాంతాల్లోనూ విజయకేతనం ఎగరేయడం ఒక్క ‘శంకరాభరణ’మే సృష్టించిన చరిత్ర. ఇన్ని పరాయిభాషాప్రాంతాల్లోనూ కేవలం మన తెలుగులోనేపాటలే వినిపించడం, కుల – మత –ప్రాంతీయ – భాషా భేదాలు లేకుండా అన్ని వర్గాల వారినీ అలరించడం న భూతో న భవిష్యతి.
ఆ పేరే ఒక ఆభరణం!
∙అప్పట్లో తెలుగు ‘శంకరాభరణం’ను మొదట కొనడానికి తటపటాయించినప్పటికీ, తరువాత ధైర్యం చేసి ఈ సినిమాను విడుదల చేసిన పంపిణీదారులందరికీ పట్టిందల్లా బంగారమైంది. కర్ణాటకలో ఈ తెలుగు చిత్రాన్ని కె.ఆర్. ప్రభు అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ విడుదల చేశారు. కేవలం రూ. 75 వేలకు హక్కులు కొన్న ఆయనకు అనేక లక్షల్లో డబ్బులొచ్చాయి.
అలా ఆ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ ప్రభు జాతకమే మారి పోయింది. ఆ ఘనవిజయంతో చివరకు ఆయన తన ఇంటికే ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే, చెన్నైలోని కామ్‌దార్‌నగర్‌లో కట్టుకున్న ఇంటికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ‘శంకరాభరణం’ అనే నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆ తరువాత ఆయన కట్టుకున్న ఇంటి పేరూ – ‘శంకరాభరణ’మే! నిజానికి, ఆ చిత్రం అందించిన ్ర పోత్సాహంతో ఆ తరువాత ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ లాంటి మరెన్నో అద్భుత కళాఖండాలను అందించినా ప్రపంచమంతా ఆయనను ఇప్పటికీ ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాతగానే నీరాజనం పడుతోంది.
ఆ సినిమాయే... ఒకపాస్ పోర్ట్
⇒ ‘శంకరాభరణం’ విడుదలైన తరువాత నటి మంజుభార్గవి ఒకసారి సింగపూర్‌కు వెళ్ళారు. అక్కడ మాల్‌లోని ఒక మహమ్మదీయ దుకాణంలో షాపింగ్ చేసుకొని వస్తుంటే, ఆ షాపు యజమాని ఆమెను ‘శంకరాభరణం’ నటిగా గుర్తుపట్టారు. అంతే! అంతటి కళాఖండంలో నటించిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోను గాక తీసుకోనంటూ, ఆ సామాన్లన్నీ ఉచితంగా ఇచ్చారు.
⇒‘శంకరాభరణం’ విడుదలై, బాగా ఆడుతున్న రోజులవి. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు హైదరాబాద్‌లో సరోవర్ హోటల్‌కు ట్యాక్సీ ఎక్కి వస్తున్నారు. కారులో ఉన్నది సాక్షాత్తూ ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత అని తెలిసి, ట్యాక్సీ వాడు మహదానందపడి, ఆయన నుంచి డబ్బులు తీసుకోలేదు. అందుకే, ‘‘దేశవిదేశాల్లో ఎక్కడకు వెళ్ళినా మా అందరికీ ‘శంకరాభరణం’ ఒకపాస్ పోర్ట్, వీసా’’ అని కె. విశ్వనాథ్ చివరి రోజుల దాకా అంటూ ఉండేవారు.
చూపులేని వారు... మనోనేత్రంతో చూసిన సినిమా!
∙సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయని శ్రీరంగం గోపాలరత్నం, రచయిత్రి శారదా అశోకవర్ధన్, నృత్యగురువు సుమతీ కౌశల్, సహా పలువురు సంగీత, సాహిత్య, నృత్యకళా వతంసులు ఎందరో ‘శంకరాభరణం’ చిత్రాన్ని చూసి, తన్మయులయ్యారు. అప్పట్లో రేడియోలో పనిచేసిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంచాల జగన్నాథరావు కంటిచూపు లేక పోవడంతో సినిమాలకు వెళ్ళేవారు కాదు. కానీ, తోటివారి బలవంతం మీద ‘శంకరాభరణం’ చూశారు. చూసి పరమానందభరితులయ్యారు.
‘‘తెర మీది సినిమా చూడలేక పోయినా, ఆ సంభాషణలు, సంగీతం, కీర్తనలు వింటూ నా మనోనేత్రంతో చిత్రాన్ని ఊహించుకొని ఎంతో ఆనందించాను. ఒక కీర్తన వింటూ, ‘తెర మీద ఏం జరుగుతోంది?’ అని పక్కనే ఉన్న మా ఆవిణ్ణి అడిగి తెలుసుకొని, ‘ఎంత చక్కగా చిత్రీకరించాడబ్బా’ అని ఆశ్చర్య పోయాను. ఈ సినిమాతో కె. విశ్వనాథ్ కళాసరస్వతికి నూతన ఆభరణం తొడిగారు’’ అని తన అనుభూతిని పంచుకోవడం విశేషం.
– రెంటాల జయదేవ


