వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’. ఆమె సోదరి పూజా శరత్‌కుమార్ ఈ సినిమాకు ఓ నిర్మాత. ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పూజా శరత్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘సరస్వతి’ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ‘ప్రతి అమ్మాయి సరస్వతిలాగా ఉండదు. సమయం వచ్చినప్పుడు కాళీలా మారుతుంది’ అనే డైలాగ్ ఈ సినిమా ట్రైలర్‌లో ఉంది. కథ వెనక ఉన్న ఆలోచన అదే... చాలా బలమైన కథ.
ఒక స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్‌ను థియేటర్స్‌లో చూస్తారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ముఖ్యమైనదే. అలాగే కీలకమైన కోర్టు సీన్ ఉంది. ఈ ఏడు నిమిషాల సింగిల్ షాట్ చాలా ఆసక్తిగా ఉంటుంది. సినిమా థ్రిల్లింగ్, ట్విస్ట్‌లతో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం. వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి అయిపోయింది. తన డైరెక్షన్‌లోని తొలి సినిమా తెలుగులోనే ఉండాలని బలంగా అనుకుంది. పరిశ్రమలో వరలక్ష్మి జర్నీ స్ఫూర్తిదాయకమైనది. ఆమెకు ‘సరస్వతి’ ప్రౌడ్ మూమెంట్.
ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి మా నాన్న (నటుడు శరత్‌కుమార్)గారు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. అవుట్‌పుట్ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇక నేను కొన్ని మ్యూజిక్ షోలు చేశాను. ఇందులో రెహమాన్‌గారివి కూడా ఉన్నాయి. ఆ తర్వాత రాడార్ (నటి రాధిక బేనర్)లో కొన్నేళ్ళు పని చేశాను. అయితే నాకు కెమెరా వెనక ఉండటమే ఇష్టం.
యాక్టింగ్ అస్సలు రాదు. ‘సరస్వతి’ కథ గురించి బాపినీడుగారికి చెబితే, మేమూ నిర్మాణంలో భాగమవుతాం అన్నారు. బన్నీ వాసుగారికి కంటెంట్ నచ్చింది. ఇలా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. మార్చి 5న మా ‘సరస్వతి’ సినిమా ప్రీమియర్స్‌ను ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్‌లో కొత్త సినిమాల కోసం స్క్రిప్ట్స్ వింటున్నాం’’ అన్నారు.


