మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ మండిపాటు | Sapthami Gowda Angry On Photographers Who Unwanted Zooming | Sakshi
Sakshi News home page

Sapthami Gowda: హీరోయిన్లని ఆ యాంగిల్‌లో ఫొటోలు తీస్తున్నారు

Mar 3 2026 5:53 PM | Updated on Mar 3 2026 6:00 PM

Sapthami Gowda Angry On Photographers Who Unwanted Zooming

కొన్నేళ్ల ముందు వరకు పాపారాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాపారాజీ అంటే ఫొటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫొటోలు తీస్తుంటారు. వీళ్లలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఇప్పుడు అలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంది. సదరు ఫొటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)

'ఇండస్ట్రీలోని మహిళందరి తరఫున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్‌లో మా పని గురించి కాకుండా, మా శరీర భాగాలని అనుచితంగా జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం సహించలేం. నటన కోసం, వృత్తి కోసమే ఇక్కడ ఉన్నాం. అలాంటిది హద్దులు దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. మా హుందాతనాన్ని ఇది దెబ్బతీస్తోంది. మీడియ మిత్రులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నాం' అని సప్తమి గౌడ.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

తమతో చాలామంది జర్నలిస్టులు గౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ.. అలాంటి మీడియా మిత్రులు కూడా ఈ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. మహిళలని ఫొటోలని తీసే విధానంలో దారుణంగా వ్యవహరిస్తున్న కొందరిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు.. ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరుని తప్పుబట్టారు. తమని అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సప్తమి గౌడ విషయానికొస్తే.. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. 2022లో రిలీజైన 'కాంతార'లో రిషభ్ శెట్టి సరసన నటించి పేరు తెచ్చుకుంది. ది వ్యాక్సిన్ వార్ అనే హిందీ మూవీ, యువ అనే కన్నడ చిత్రాలు చేసింది. నితిన్ 'తమ్ముడు'తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదు. ఈమె నటించిన 'ద రైజ్ ఆఫ్ అశోక'.. గతవారమే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే సప్తమికి ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

Advertisement
 
Advertisement
Advertisement