టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత? | How The Iran Israel War Could Impact Tollywood And Upcoming Pan India Films, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

Tollywood: షూటింగ్స్ బంద్.. వేలకోట్ల రూపాయల నష్టం?

Mar 3 2026 9:08 PM | Updated on Mar 4 2026 12:15 PM

Is Tollywood Effected By Iran Israel War

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దీని వల్ల పెట్రోలు, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని భారతీయులు కంగారు పడుతున్నారు. మరోవైపు ఇదే యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్‌పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు?

(ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు)

బలమైన మార్కెట్
ఒకప్పుడు అంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్‌తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో.. అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలామంది భారతీయులు.. అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో మూవీస్ రిలీజులు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు.. వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్నినెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చు.

షూటింగ్స్ బంద్
మన దేశంలో తీసే చాలా సినిమాలని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయితో పాటు మిగతా అరబ్ కంట్రీస్‌లో పాటల షూటింగ్స్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలావరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలావరకు షూటింగ్స్‌కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇ‍ప్పుడు మరో చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నింటినీ మరోచోటకు తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు.

ప్రయాణ ఆంక్షలు
ఇదే యుద్ధం వల్ల చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలావరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుంటారు. యాక్షన్ సీన్స్ లాంటి వాటికోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్‌ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంతవరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పవు.

విడుదల వాయిదా
ఇదే యుద్ధ ప్రభావం.. రాజమౌళి తీస్తున్న 'వారణాసి', అల్లు అర్జున్-అట్లీ చేస్తున్న సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై కచ్చితంగా పడే అవకాశమైతే ఉండొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్నిరోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడటం గ్యారంటీ.

ఆర్థిక భారం
యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగొచ్చు. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాల ఇంకాస్త లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

ఇదే యుద్ధం కారణంగా చాలామంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్లందరూ స్వదేశానికి వచ్చేసినా సరే భయమనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమపైనా పరోక్షంగా పడింది. రూ.10 వేల కోట్లకు పైనే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

 

(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

Advertisement
 
Advertisement
Advertisement