1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో మొత్తం 100కుపైగా చిత్రాల్లో కథానాయికిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో కథానాయకిగా పరిచయమై , ఆ వెంటనే. మాతృభాషలో (తెలుగు) ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, బోజ్‌పురి ఇలా ఎనిమిది భాషల్లో నటించారు.
తెలుగులో చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు, అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, కార్తీక్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. నిర్మాతగాను అవతారమెత్తిన ఈమె కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. కథానాయకిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగా ఇంద్రకుమార్ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. వీరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న రంభ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ కావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల చెన్నైకి చేరుకున్న ఈ భామ సినిమాల్లో అవకాశాల వేట మొదలుపెట్టారు. అందుకుగాను 49 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకున్నారు.
సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంటూ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొత్తం మీద తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అలా అందాల భామ రీఎంట్రీ షురూ అయింది అన్నమాట.


