శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇందులో గాయత్రీ రమణ, సాయి కామాక్షీ భాస్కర్ల హీరోయిన్లుగా నటించారు. రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనాథ్ మాగంటి మాట్లాడతూ– ‘‘ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ సబ్జెక్ట్ యూనివర్సల్. దారి తప్పిన మల్లేష్ (హీరో పాత్ర) అనే పొగరుబోతుని అతని తల్లి, భార్య కలిసి ఎలా దారిలోకి తీసుకొస్తారన్నదే ఈ సినిమా కథ.
ఈ విషయాన్నే సరదాగా చెప్పా. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకునే సినిమా ఇది. సతీష్‌గారు మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. నిర్మాత రాజేష్‌గారు ఈ సినిమాలో నటించడంతోపాటు కొన్ని డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో నటించిన హరి హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయారు. అయితే తన పాత్ర చిత్రీకరణ అప్పటికే పూర్తయింది. ఈ సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు.
ఇక ఈ సినిమాతో యాక్టర్‌గా నన్ను నేను కొత్తగా స్క్రీన్‌పై చూపించుకోవడానికి ఒక చాన్స్ లభించింది. అందుకే మల్లేష్ క్యారెక్టర్ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. ‘హిట్, యానిమల్, లక్కీభాస్కర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించాను. కానీ కొందరు ప్రేక్షకులు నన్ను పరభాషా నటుణ్ణి అనుకుంటున్నారు. నేను పక్కా తెలుగు యాక్టర్‌ని. ఈ సినిమాతోనైనా తెలుగు ప్రేక్షకులు నా పేరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.
సందీప్ రెడ్డి వంగాగారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మా సినిమాను థియేటర్స్‌లో చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంలో నటిస్తున్నాను. సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నాను’’ అని తెలిపారు.


