అజిత్‌ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు! | Rohit Pawar opposes CBI probe in Ajit Pawar plane crash | Sakshi
Sakshi News home page

అజిత్‌ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!

Feb 24 2026 6:18 AM | Updated on Feb 24 2026 8:59 AM

Rohit Pawar opposes CBI probe in Ajit Pawar plane crash

మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎన్సీపీ (ఎస్పీ) ధ్వజం

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార్చేందుకే ఫడ్నవీస్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందంటూ పార్టీ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ సోమవారం దుయ్యబ ట్టారు. సీబీఐ వద్ద ఇప్పటికే ఏకంగా 7 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. 

వాటిలో 2,500 కేసులకైతే ఏకంగా దశాబ్దానికి అతీగతీ లేదంటూ ఆక్షేపించారు. దర్యాప్తు పేరుతో కాలహరణం చేసే ఈ యత్నాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని రోహిత్‌ కుండబద్దలు కొట్టారు. విమాన ప్రమాదంపై సీఐడీతోనే దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వివరాల్లో 30 శాతాన్ని మాత్రమే బయటపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ కాలిపోయిందని చెప్పడంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు.

 ‘‘బ్లాక్‌బాక్స్‌ను సురక్షితంగా వెలికితీశారు. దాన్ని అందరూ చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నా దగ్గరున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని చెప్పడం వెనక మతలబు ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఏవైనా లోపాలు జరిగినట్టు తేలితే ఫడ్నవీస్‌ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అసెంబ్లీలో అజిత్‌ పవార్‌కు రోహిత్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తన సాన్నిహిత్యాన్ని తలచుకుంటూ కంటతడి పెట్టారు.

అజిత్‌ విమాన ప్రమాదం దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన మరో ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ కూడా పేర్కొన్నారు. ‘‘బ్లాక్‌బాక్స్‌ కాలిపోవడం ఏమిటి? ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా అలా జరగలేదు. ప్రమాద కారణాలను తేల్చేందుకు జరుగుతున్న దర్యాప్తే మరిన్ని అనుమానాలకు దారితీస్తే ప్రజలిక దేన్ని నమ్మాలి?’’ అని ప్రశ్నించారు. ప్రమాదానికి గురైన విమానానికి భారత్‌లో నడిచేందుకు అనుమతే లేదని అవద్‌ ఆక్షేపించారు. ‘‘ఆ విమానాన్ని మొత్తం జీవితకాలంలో గరిష్టంగా 5,000 గంటలకు మించి నడపరాదు. కానీ అప్పటికే అది 8,000 గంటల పాటు నడిచింది. ఇవన్నీ మొత్తం ఉదంతంపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి’’ అన్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement