జెట్లను తాత్కాలికంగా పక్కన పెట్టిన వాయుసేన?
ప్రమాదం నేపథ్యంలో నిర్ణయం!
సాంకేతిక సమస్యే: హెచ్‌ఏఎల్
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికరకం తేజస్ యుద్ధ విమానాల వినియోగాన్ని వాయుసేన తాత్కాలికంగా పక్కన పెట్టిందంటూ వార్తలు వస్తున్నాయి! ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
ఫిబ్రవరి 7వ తేదీన తేజస్ విమానం ల్యాండవుతుండగా ప్రమాదానికి గురైనట్టు సోమవారం వార్తలొచ్చాయి. పైలట్ సురక్షితంగా బయటపడ్డా, ఆ ప్రమాదంలో విమానం బాగా దెబ్బతిన్నట్టు అవి పేర్కొన్నాయి. కానీ దీన్ని హెచ్‌ఏఎల్ మంగళవారం ఖండించింది. జరిగింది ప్రమాదం కాదని, ‘చిన్న ఘటన’మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి ఒక ప్రకటన జారీ చేశారు. ‘‘తేజస్ నేలకూలిందన్న వార్తలు నిజం కాదు.
విమానం నేలపై ఉండగా చిన్న సాంకేతిక సమస్య తలెత్తిందంతే’’అని పేర్కొన్నారు. ‘‘తేజస్ విషయంలో ప్రపంచంలోని అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాం. తాజా ఉదంతాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో వాయుసేనతో కలిసి పని చేస్తున్నాం. సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది’’అని వివరించారు. అయితే తేజస్‌లో తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించి వివరాలేమీ వెల్లడించలేదు.
ఫిబ్రవరి 7న ఒక వైమానిక స్థావరంలో ల్యాండయ్యే క్రమంలో తేజస్ విమానం రన్‌వేను దాటి ముందుకు వెళ్లిపోవడంతో బాగా దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు. దాంతో అదిక వినియోగానికి ఏమాత్రమూ పనికిరాదని వాయుసేన నిర్ధారించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై కూడా హెచ్‌ఏఎల్ తన ప్రకటనలో స్పందించలేదు. ప్రస్తుతానికి తేజస్ రకం విమానాలన్నింట్లో వాయుసేన పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. భద్రత తదితర ప్రమాణాలను పూర్తిగా నిర్ధారించుకున్నాకే తిరిగి వాటి వాడకంపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
షెడ్యూల్ మేరకు తేజస్ శ్రేణిలో రెండో తరం ఎంకే1ఏ యుద్ధవిమానాల భద్రతా ప్రమాణాలను వచ్చే ఏప్రిల్లో వాయుసేన పూర్తిస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంది. వాటిని వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చుకోవడంపై ఆ తర్వాతే రక్షణ శాఖ తుది నిర్ణయానికి రానుంది. వాయుసేనలో ప్రస్తుతం 30 తేజస్ ఎంకే1 శ్రేణి యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. తేజస్ తాజా ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణమని ప్రాథమికంగా తేలినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా విమానంలోని పలు ఆన్‌బోర్డ్ వ్యవస్థల్లో కీలక వైఫల్యాలను గుర్తించారని అంటున్నారు.


