సురక్షితమైన ల్యాండింగ్‌ను సుసాధ్యం చేసే హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ బిగింపు
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక లేదా రన్‌వేపై దిగాల్సిన సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం జరక్కుండా పైలట్‌కు, విమానానికి సాయపడేలా హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌ను డిజైన్‌చేశారు. పూర్తి దేశీయంగా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ అధునాతన పారాచూట్‌కు తుదిరూపునిచ్చింది.
తేజస్ వంటి యుద్ధవిమానాల రక్షణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీనిని తయారుచేశారు. ఈ పారాచూట్ బరువు సైతం చాలా తక్కువ. దీంతో పేలోడ్(మందుగుండు)ను మోసుకెళ్లే తేజస్‌కు కొత్తగా అదనపు బరువు లాంటి సమస్యలేవీ ఉండబోవు. దీంతో అత్యంత వేగంగా గాల్లో దూసుకెళ్లేటప్పుడు భార సంబంధ ఇబ్బందులు తలెత్తబోవు. దీంతో అత్యవసర సందర్భాల్లో అత్యల్ప పొడవైన రన్‌వేలపై ల్యాండ్ అయ్యాక తక్కువ దూరంలో ఆగిపోయేలా ఈ పారాచూట్ ఎంతగానో సాయపడుతుంది.
ఎలా ఉపయోగకరం?
సాధారణ పౌరవిమానాలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయినప్పుడు రన్‌వేకు ఆ కొన వద్ద ల్యాండ్ అయి రెండు, మూడు కిలోమీటర్ల దూరం దాకా రన్‌వేపై పరుగులు తీస్తాయి. అత్యవసర సందర్భాల్లో తేజస్ వంటి యుద్ధవిమానాలకు అంత పొడవాటి రన్‌వే ఉండే విమానాశ్రయాలు అందుబాటులో ఉండవు. తక్కువ పొడవున్న రన్‌వేలపై ల్యాండ్ అయ్యాక వేగంతో అలాగే ముందుకు దూసుకెళ్లకుండా ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ నిలువరిస్తుంది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థలపై పనిభారం భారీగా తగ్గుతుంది. వెడల్పాటి ప్లస్ గుర్తు ఆకృతిలో ఉండే భారీ వస్త్రపు చివరలను కలుపుతూ గొడుగు ఆకృతిలో దీనిని తయారుచేస్తారు.
ల్యాండింగ్ పూర్తయ్యాక రన్‌వే మీద విమానం అటూఇటూ ఊగకుండా స్థిరంగా ముందుకు కదిలేలా ఈ పారాచూట్ సాయపడుతుంది. రన్‌వే మీద విమానం ముందుకు దూసుకెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే అత్యధిక గాలి, ఒత్తిడిని తట్టుకుని ఇది విమానాన్ని వేగంగా ఆపేయగలదు. పారాచూట్ వెడల్పు కేవలం 5.75 మీటర్లు. విస్తీర్ణం 17 చదరపు మీటర్లు. దీని బరువు కేవలం 10 కేజీలు. యుద్ధవిమానం గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ హఠాత్తుగా రన్‌వేపై ల్యాండ్ అయినా కూడా సమయానుగుణంగా విచ్చుకుని త్వరగా విమానం రన్‌వే మీద ఆగేలా చేస్తుంది.
హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అంటే?
సాధారణ సందర్భాలతోపాటు అత్యవసర సమయాల్లోనూ విమానాన్ని నిర్దేశిత దూరం తర్వాత రన్‌వే మీద ఆపగలిగే సామర్థ్యమున్న పారాచూట్‌ను హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌గా పిలుస్తారు. తెగిపోని, అత్యంత కఠినమైన నైలాన్, కెవ్లార్ వంటి కృత్రిమ రసాయన దారాలతో ఈ పారాచూట్‌ను తయారుచేస్తారు. విమానం రకం, బరువు, ల్యాండింగ్ గరిష్ట వేగాలకు తగ్గ బరువు, సైజు, డిజైన్‌తో పారాచూట్‌ను తయారుచేస్తారు.


