పదేళ్ల బాలుడిపై 150 దెబ్బలు | UP Teacher beats class-2 child 105 times with stick in Gonda dist | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాలుడిపై 150 దెబ్బలు

Feb 8 2026 5:33 AM | Updated on Feb 8 2026 5:33 AM

UP Teacher beats class-2 child 105 times with stick in Gonda dist

హోమ్‌వర్క్‌ చేయలేదని రెండో క్లాస్‌ విద్యార్థిపై ప్రైవేట్‌ టీచర్‌ దాష్టీకం

ఉత్తరప్రదేశ్‌లో ఘటన

గోండా(యూపీ): రెండో తరగతి చదువుతున్న విద్యార్థి హోమ్‌వర్క్‌ చేయకపోతే ఎందుకు చేయలేదు? మర్చిపోయావా? నిర్లక్ష్యమా? ఇంకేదైనా కారణమా? అని ముందు ఆరా తీయాల్సిందిపోయి ఉన్నపళంగా బెత్తంతో విరుచుకుపడి బాలుడిని ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ చితకబాదిన వైనం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లిష్‌ టీచర్‌ ప్రఖార్‌ సింగ్‌ ఏకధాటిగా 150 సార్లు బెత్తంతో పిల్లాడిని కొట్టాడు. 

దెబ్బల ధాటికి పదేళ్ల పిల్లాడి కాళ్ల నిండా బెత్తం గాయాల బొబ్బలు తేలాయి. గోండా జిల్లాలోని కర్నేల్‌గంజ్‌ గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో శనివారం ఈ దారుణం జరిగింది. పిల్లాడిని ఇష్టారీతిగా కొట్టిన ఘటనలో టీచర్‌పై కేసు నమోదైంది. ఈ వివరాలను పిల్లాడి తండ్రి మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇంటికొచ్చిన పిల్లాడు కనీసం నడవలేకపోయాడు. కుంటుతూ రావడంతో ఏం జరిగిందని ఆరాతీశా. 105 సార్లకుపైగా టీచర్‌ కొట్టాడని మా అబ్బాయి చెప్పాడు.

 కాళ్లు మొత్తం వాచిపోయి బొబ్బలొచ్చాయి. కొట్టిన విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని టీచర్‌ బెదిరించాడు. ఏడ్వడం ఆపేయాలని మావాడికి టీచర్‌ బిస్కెట్లు కూడా ఇచ్చాడు. రెండో తరగతి విద్యార్థిని ఎవరైనా ఇంతలా కొడతారా? వెంటనే ఈ విషయమై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదుచేశా. తర్వాత వెంటనే పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇచ్చా’’ అని తండ్రి వెల్లడించారు. 

తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదురావడంతో ఇంగ్లిష్‌ టీచర్‌ను విధుల నుంచి తప్పించామని ఎంఆర్‌జీ పాఠశాల ప్రిన్సిపల్‌ మీడియాకు స్పష్టంచేశారు. ‘‘భారతీయ న్యాయసంహితలోని 115(2), 351(3), 352 సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేశాం. కేసు దర్యాప్తు మొదలుపెట్టాం. ఈ అంశంలో ప్రత్యేక చట్టపర చర్యలు తీసుకుంటాం’’ అని కర్నేల్‌గంజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిషేక్‌ దబాఛా చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement