వార్తాపత్రిక అనేది అక్షర రూపంలో ఉన్న ఒక విజ్ఞాన గని. ఇది మనకు ప్రపంచంతో అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా, మన ఆలోచనలకు పదును పెడుతుంది. నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదకోశం పెరుగుతుంది. సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఉత్తరప్రదేశ్ సర్కారు పాఠశాల విద్యలో పత్రికా పఠనాన్ని తప్పనిసరి చేసింది. ఇది దేశవ్యాప్తంగా విద్యావేత్తల మధ్య చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో వార్తా పత్రికల పరిస్థితి ఏమిటనే దానిని తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటికి సమాధానమివ్వడమే ఈ ‘కథనం’లోని ప్రయత్నం.
యూపీ సర్కారు ముందడుగు
విద్యార్థులలో సమకాలీన అంశాలపై అవగాహన పెంచడానికి, వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘వార్తాపత్రిక పఠనాన్ని’ తప్పనిసరి చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచం నలుమూలల జరుగుతున్న పరిణామాలను విద్యార్థులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గత కొంతకాలంగా డిజిటల్ విప్లవం కారణంగా విద్యార్థులు సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లకు అధికంగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల అవసరమైన సమాచారంపై అవగాహన తగ్గడమే కాకుండా, పఠనాశక్తి కూడా క్షీణిస్తోంది. ఈ ధోరణిని గమనించిన ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ, విద్యార్థులను తిరిగి పుస్తకాలు, వార్తాపత్రికల వైపు మళ్లించాలని నిర్ణయించింది.

నోటీసు బోర్డులపై ‘ప్రధానాంశాలు’
యూపీ అంతటా అమలుకానున్న ఈ నూతన విధానంలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాల కనీసం రెండు హిందీ, ఒక ఆంగ్ల దినపత్రికను అందుబాటులో ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమయం తర్వాత లేదా లైబ్రరీ పీరియడ్‌లో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు విద్యార్థులచే ఉపాధ్యాయులు వార్తలు చదివించాలి. ముఖ్యంగా ఎడిటోరియల్ కాలమ్స్, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం, జాతీయ అంశాల పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాఠశాలల్లోని నోటీసు బోర్డులపై రోజువారీ ముఖ్య వార్తలను ప్రదర్శించడం కూడా ఈ ప్రణాళికలో ఒక భాగం. కాగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సానుకూల స్పందన వస్తోంది. విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో ఇది పునాదిగా మారుతుందని వారు అంటున్నారు.
భారత్‌లో అద్భుతమైన వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత వార్తాపత్రికా పరిశ్రమ 2025లో అద్భుతమైన వృద్ధిని చవిచూసింది. పాశ్చాత్య దేశాలలో వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నా, భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రింట్ మార్కెట్‌గా అవతరించింది. 1.4 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ప్రచురణలు, రోజువారీ 39 కోట్ల సర్క్యులేషన్‌తో ఈ రంగం వెలుగొందుతోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) నివేదికల ప్రకారం, 2025 ప్రథమార్ధంలో వార్తాపత్రికల అమ్మకాలు 2.77% వృద్ధిని సాధించి, ప్రతిరోజూ 30 మిలియన్ల కాపీల మార్కును చేరుకోవడం గమనార్హం.

న్యూస్‌ప్రింట్ ధరలలో అస్థిరత
ఈ వృద్ధికి ప్రధానంగా ప్రాంతీయ భాషా పత్రికలు, ముఖ్యంగా హిందీ దినపత్రికలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మొత్తం సర్క్యులేషన్‌లో 51శాతం వాటాను హిందీ పత్రికలే దక్కించుకోగా, ప్రాంతీయ భాషలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక కోణంలో చూస్తే భారతీయ పత్రికలు నేటికీ ప్రకటనల ఆదాయంపైనే (60-70%) ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పాఠకులకు వార్తాపత్రికను అందుబాటులో ఉంచేందుకు ధరను తక్కువగా ఉంచడం వల్ల, ఆయా సంస్థలకు ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. 2024లో ఎన్నికలు, రియల్ ఎస్టేట్, ఎఫ్‌ఎంసీజీ రంగాల వృద్ధి కారణంగా వార్తా పత్రికలకు ప్రకటన గణనీయంగా పెరిగాయి. అయితే రష్యా, కెనడా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్ ధరలలో అస్థిరత నిర్వహణ వ్యయాన్ని పెంచుతూ ప్రచురణకర్తలకు సవాలుగా మారుతున్నది.
విశ్వసనీయత కోసం ముద్రిత పత్రికలు
సాంకేతికత పరంగా చూస్తే 2025లో ‘డిజిటల్-ఫస్ట్’ హైబ్రిడ్ మోడల్ వైపు పరిశ్రమ వేగంగా అడుగులు వేస్తోంది. కాగా ఆన్‌లైన్ తప్పుడు సమాచారంపై విసిగిపోయిన పాఠకులు, విశ్వసనీయత కోసం తిరిగి ముద్రిత పత్రికలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో యువతను ఆకట్టుకోవడానికి పలు పత్రికా సంస్థలు తమ ఈ-పేపర్లు, మొబైల్ యాప్‌లను బలోపేతం చేస్తున్నాయి. 68 శాతం మంది ఇంటర్నెట్ యూజర్స్ ఆన్‌లైన్ వార్తలను యాక్సెస్ చేస్తున్నందున.. ప్రీమియం కంటెంట్ ద్వారా డిజిటల్ ఆదాయాన్ని పెంచుకోవడంపై అన్ని వార్తా పత్రికలు దృష్టి సారించాయి.
ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత


