ఇషాన్, పాండ్యా చెలరేగగా... | India Beat Namibia By 93 Runs In T20 World Cup, Check Out Full Score Details And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

ఇషాన్, పాండ్యా చెలరేగగా...

Feb 13 2026 3:58 AM | Updated on Feb 13 2026 11:56 AM

India beat Namibia by 93 runs in T20 World Cup

భారత్‌కు భారీ విజయం 

93 పరుగులతో నమీబియా ఓటమి

వరుణ్‌ చక్రవర్తి 3/7 

ఆదివారం పాకిస్తాన్‌తో భారత్‌ పోరు  

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్‌ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్‌ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. 

ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్‌ మెరుపులు, వరుణ్‌ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది.  

న్యూఢిల్లీ: టి20 వరల్డ్‌కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. 

నమీబియా కెప్టెన్, ఆఫ్‌స్పిన్నర్‌ గెరార్డ్‌ ఎరాస్మస్‌ (4/20) పొదుపైన బౌలింగ్‌ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్‌ స్టీన్‌కాంప్‌ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా...వరుణ్‌ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్‌ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్‌ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్‌తో తలపడుతుంది.  

ఇషాన్‌ 6, 6, 6, 6, 4... 
అభిషేక్‌ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్‌ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్‌ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌తో స్కోరింగ్‌ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఇషాన్‌ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్‌ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. 

ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్‌... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్‌ కప్‌లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఇషాన్‌ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌ (12), హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. 

అయితే పాండ్యా, శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్‌ పాండ్యా 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది.  

టపటపా... 
ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్‌కాంప్‌తో పాటు ఫ్రైలింగ్‌ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఎరాస్మస్‌ (11 బంతుల్లో 18; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్‌ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) షికోంగో (బి) ఎరాస్మస్‌ 61; సామ్సన్‌ (సి) స్టీన్‌కాంప్‌ (బి) షికోంగో 22; తిలక్‌ (సి) స్మిట్‌ (బి) ఎరాస్మస్‌ 25; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) గ్రీన్‌ (బి) స్కాల్‌ 12; పాండ్యా (సి) (సబ్‌) లీషర్‌ (బి) ఎరాస్మస్‌ 52; దూబే (రనౌట్‌) 23; రింకూ (సి) ఎరాస్మర్‌ (బి) స్మిట్‌ 1; అక్షర్‌ (బి) ఎరాస్మస్‌ 0; వరుణ్‌ (నాటౌట్‌) 1; అర్‌‡్షదీప్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్‌: రూబెన్‌ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్‌ 4–0–50–1, హీన్‌గో 1–0–18–0, ఎరాస్మస్‌ 4–0–20–4, స్కాల్‌ 4–0–41–1.  

నమీబియా ఇన్నింగ్స్‌: స్టీన్‌కాంప్‌ (బి) వరుణ్‌ 29; ఫ్రైలింక్‌ (సి) దూబే (బి) అర్‌‡్షదీప్‌ 22; జాన్‌ నికోల్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 13; ఎరాస్మస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 18; స్మిట్‌ (బి) వరుణ్‌ 0; గ్రీన్‌ (హిట్‌వికెట్‌) (బి) దూబే 11; క్రూగర్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ 5; రూబెన్‌ (బి) బుమ్రా 6; స్కాల్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్‌గో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 4–0–21 –2, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3–0–36–1, శివమ్‌ దూబే 2.2–0–11–1, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–20–1, వరుణ్‌ చక్రవర్తి 2–0–7–3, అక్షర్‌ పటేల్‌ 3–1–20–2.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా x జింబాబ్వే
వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి 
కెనడా  x  యూఏఈ
వేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి 
నెదర్లాండ్స్‌ x  అమెరికా
వేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement