50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత్ క్లీన్‌స్వీప్
ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లకు స్వర్ణ, రజత, కాంస్యాలు
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్‌లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు.
భారత్‌కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.
జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు.


