T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌ | T20 WC 2026, IND VS NAM: Arshdeep Singh completes 250 T20 wickets | Sakshi
Sakshi News home page

T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌

Feb 12 2026 9:54 PM | Updated on Feb 12 2026 9:54 PM

T20 WC 2026, IND VS NAM: Arshdeep Singh completes 250 T20 wickets

భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్‌ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్‌ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. జాన్‌ ఫ్రైలింక్‌ వికెట్‌ అర్షదీప్‌కు 250వ వికెట్‌.

అర్షదీప్‌ కెరీర్‌ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్‌ మొత్తంలో అర్షదీప్‌ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్‌ తన టీ20 కెరీర్‌లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్‌ అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్‌లో అర్షదీప్‌ 97 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్‌కు ఈ స్కోర్‌ అందించారు.

మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12;  సిక్స్‌) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు.

ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 88-5గా ఉంది. వరుణ్‌ చక్రవర్తి 3, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నమీబియాను దెబ్బకొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement