T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌ | Ishan becomes the first Indian WK batter to score a fifty in T20 World Cup history | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

Feb 12 2026 8:34 PM | Updated on Feb 12 2026 8:40 PM

Ishan becomes the first Indian WK batter to score a fifty in T20 World Cup history

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు ఏ భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్‌ (2007, 2024) అయినా, ఓ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం​ నిజంగానే ఆశ్చర్యకరం.

20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
ఈ రికార్డు హాఫ్‌ సెంచరీని ఇషాన్‌ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. 

మూడో ఓవర్లో అతను సహజ మోడ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్‌.. ఆమరుసటి ఓవర్‌లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్‌ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో వరుసగా మరో సిక్సర్‌, బౌండరీ కొట్టాడు. 

అనంతరం 7వ ఓవర్‌ తొలి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్‌ ధాటికి భారత్‌ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.

అంతకుముందు సంజూ శాంసన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్‌ సిక్సర్లు, బౌండరీ ​కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్‌ ఔటయ్యాక భారత స్కోర్‌ కాస్త నెమ్మదించింది.

హార్దిక్‌ లైన్‌లోకి వచ్చాడు
అయితే హార్దిక్‌ పాండ్యా రాకతో భారత స్కోర్‌ మళ్లీ జోరందుకుంది. హార్దిక్‌ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 205/5గా ఉంది. శివమ్‌ దూబే (23), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement