టీ20 ప్రపంచకప్‌లో సంచలనం | Italy stuns Nepal in T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌లో సంచలనం

Feb 12 2026 6:01 PM | Updated on Feb 12 2026 6:17 PM

Italy stuns Nepal in T20 World Cup 2026

ఇటలీ క్రికెట్‌ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్‌ జట్టు ప్రపంచకప్‌లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్‌ 2026 బెర్త్‌ దక్కించుకుంది.

తొలి ప్రపంచకప్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న నేపాల్‌పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్‌ జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్‌ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.

మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్‌-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇటలీ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్‌సన్‌ స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.

తొలి మ్యాచ్‌లో ఇటలీకి స్కాట్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్‌ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.

తిప్పేసిన స్పిన్నర్లు
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ నేపాల్‌ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు.

నేపాల్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.

మోస్కా బ్రదర్స్‌ అదుర్స్‌
124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్‌ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్‌ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. 

జస్టిన్‌, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.

చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్‌
ఈ మ్యాచ్‌లో మోస్కా బ్రదర్స్‌ చరిత్ర సృష్టించారు. తొలి వికెట​్‌కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అ‍న్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement