T20 WC 2026: మహ్మద్‌ నబీకి షాకిచ్చిన ఐసీసీ | T20 WC: Afghanistan Nabi Handed Hefty Penalty By ICC Reason Is | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మహ్మద్‌ నబీకి షాకిచ్చిన ఐసీసీ

Feb 12 2026 3:51 PM | Updated on Feb 12 2026 4:14 PM

T20 WC: Afghanistan Nabi Handed Hefty Penalty By ICC Reason Is

అఫ్గనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది.

సమ ఉజ్జీలుగా
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్‌ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్‌ కీలక ఆటగాళ్లను అవుట్‌ చేసి‌ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.

రెండు సూపర్‌ ఓవర్లు
ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. అఫ్గన్‌- ప్రొటిస్‌ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.

ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్‌ లిండే బౌలింగ్‌లో ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్‌ పద్నాలుగో ఇన్నింగ్స్‌లో నబీ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.

అంపైర్‌తో వాగ్వాదం
లుంగి ఎంగిడి ధరించిన రిస్ట్‌ బ్యాండ్‌ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్‌తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ గిల్బర్ట్‌ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.

అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్‌ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.  

చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement