చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌ | T20 WC: Dasun Shanaka breaks own record to hit fastest T20I fifty | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌

Feb 12 2026 2:14 PM | Updated on Feb 12 2026 2:20 PM

T20 WC: Dasun Shanaka breaks own record to hit fastest T20I fifty

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో ధనాధన్‌ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్‌ గురువారం నాటి మ్యాచ్‌లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.

కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకం
పల్లెకెలె వేదికగా టాస్‌ గెలిచిన ఒమన్‌.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (13), కమిల్‌ మిశారా (8) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో అలరించాడు.

మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్‌.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ పవన్‌ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌ దసున్‌ శనక సుడిగాలి ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.

కేవలం 19 బంతుల్లోనే 
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.

ఇక ఒమన్‌తో తాజా మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్‌ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్‌ ఏడు బంతుల్లో 19, దునిత్‌ వెల్లలగే నాలుగు బంతుల్లో  6 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్‌ బౌలర్లలో జితేన్‌ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్‌ మెహమూద్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే
🏏దసున్‌ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్‌ మీద 19 బంతుల్లో
🏏దసున్‌ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో
🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో
🏏కుమార్‌ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.

చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement