నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌ | "Thank God We Won Against Nepal The Other Night...": Harry Brook Reaction After Losing To West Indies Goes Viral | Sakshi
Sakshi News home page

ENG vs WI: నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

Feb 12 2026 8:58 AM | Updated on Feb 12 2026 10:43 AM

Thank God: Harry Brook Reaction after losing to West Indies goes viral

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్‌ తడబడుతోంది. గ్రూప్‌-‘సి’లో భాగంగా తొలుత నేపాల్‌తో తలపడ్డ హ్యారీ బ్రూక్‌ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్‌ ముందు తలవంచింది.

వెస్టిండీస్‌దే పైచేయి
టీ20 ప్రపంచకప్‌ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్‌దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్‌ స్పిన్‌ను ఎదుర్కోలేక ఇంగ్లండ్‌ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్‌ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.

నిరాశకు గురయ్యాం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్‌ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్‌ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.

ప్రత్యర్థి బౌలర్‌ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్‌గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.

సాల్ట్‌ విధ్వంసకర ప్లేయర్‌
మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్‌ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్‌ విధ్వంసకర ప్లేయర్‌. ఇక జోస్‌ బట్లర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేపాల్‌ మీదైనా గెలిచాం
ఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్‌లో నేపాల్‌ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్‌, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్‌ చెప్పుకొచ్చాడు.

196 పరుగుల భారీ స్కోరు
కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (42 బంతుల్లో 76 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్‌ ఛేజ్‌ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్‌ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

స్పిన్నర్ల మాయాజాలం 
ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్, జేమీ ఒవర్టన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్‌ బెతెల్‌ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిల్‌ సాల్ట్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... జోస్‌ బట్లర్‌ (21), కెప్టెన్‌ హారీ బ్రూక్‌ (17) ప్రభావం చూపలేకపోయారు.

చివర్లో స్యామ్‌ కరన్‌ (30 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. విండీస్‌ స్పిన్నర్లు గుడకేశ్‌ మోతీ 3, రోస్టన్‌ ఛేజ్‌ 2, అకీల్‌ హొసీన్‌ ఒక వికెట్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు.  

చదవండి:  SA vs AFG: ‘డబుల్‌ సూపర్‌’ ధమాకా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement