బంగ్లాదేశ్ మరోసారి మాట మార్చింది. పదే పదే యూటర్న్‌లు తీసుకుంటూ నవ్వులపాలు అవుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొన్న విషయం తెలిసిందే.
భారత్‌లో తమకు భద్రత ఉండదని.. తమ వేదికను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది బంగ్లాదేశ్. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లా వాదనను కొట్టిపడేస్తూ పునరాలోచన చేయాలని గడువు ఇచ్చింది. అయినప్పటికీ తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి వైదొలగడానికైనా సిద్ధమే కానీ.. భారత్‌లో ఆడమని భీష్మించుకుని కూర్చుంది.
బంగ్లాదేశ్‌ను తప్పించి
ఫలితంగా బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి అనుమతించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుని బంగ్లాకు మద్దతుగా నిలిచింది. తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని నాటకాలు ఆడింది. అయితే, ఐసీసీ రంగంలోకి దిగగా.. పాక్ భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించింది.
ఆటగాళ్ల నిర్ణయమే ఇది
అదే విధంగా.. బంగ్లాదేశ్‌పై ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం బంగ్లా క్రికెట్ బోర్డు, క్రికెటర్లు కలిసి టోర్నీని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఇందులో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నాడు. గతంలో ఇదే వ్యక్తి ప్రభుత్వం ఆదేశించినట్లుగానే టోర్నీ నుంచి తప్పుకొంటున్నామని తెలిపాడు. ఆ తర్వాత ఈమేరకు నాలుక మడతేశాడు. దీంతో ఆసిఫ్ నజ్రుల్, బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
మరోసారి మాట మార్చేశాడు
ఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన ఆసిఫ్ నజ్రుల్ మరోసారి మాట మార్చాడు. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడకూడదన్నది మా ప్రభుత్వ నిర్ణయమే. మరోసారి ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు.
మీడియాతో మాట్లాడటానికి తాను పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో బీసీబీ, క్రికెటర్ల నిర్ణయమేనని అనుకోకుండా చెప్పేశానని పేర్కొన్నాడు. తన మాటల్ని అందరూ అపార్థం చేసుకున్నారని నజ్రుల్ కవర్ చేశాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటగాళ్లు శిరసా వహించారని.. ఈ విషయంలో వారికి క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చాడు.
పరువు పాయే
దీంతో నెటిజన్లు బంగ్లాదేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ను నిందించాలనే తొందరలో మీ ఆటగాళ్లను కూడా బలి చేసేందుకు సిద్ధపడి.. పరువు తీసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైంది.
చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్


