ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బంగ్లాదేశ్ | Decision Taken By Players: Bangladesh Takes Stunning T20 WC U Turn | Sakshi
Sakshi News home page

ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బంగ్లాదేశ్

Feb 11 2026 1:10 PM | Updated on Feb 11 2026 1:35 PM

Decision Taken By Players: Bangladesh Takes Stunning T20 WC U Turn

బంగ్లాదేశ్‌ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నుంచి వైదొలగడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు.

కాగా భారత్‌- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడేందుకు రాలేమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. భారత్‌లో తమకు భద్రత ఉండదని.. మరో వేదికైన శ్రీలంకకు తమ మ్యాచ్‌లు మార్చాలని అభ్యర్థించింది.

ప్రభుత్వ నిర్ణయానుసారమే..
అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తమ బృందం తేల్చించిందన్న ఐసీసీ.. పునరాలోచన చేయాల్సిందిగా బీసీబీకి చెప్పింది. కానీ.. తమ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదని.. ప్రభుత్వ నిర్ణయానుసారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా తాము సిద్ధమని బీసీబీ ఐసీసీకి స్పష్టం చేసింది.

ఈ విషయం గురించి జనవరి 22న బంగ్లాదేశ్‌ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు అర్థమయ్యేలా చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశాము.

నాకు తెలిసి వాళ్లు అర్థం చేసుకునే ఉంటారు. ఐసీసీలో మాకు న్యాయం దొరకదనే అనిపించింది. టోర్నీలో మేము ఆడేది.. లేనిది అంతా ప్రభుత్వ నిర్ణయమే’’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి.. ర్యాంకింగ్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ను అనుమతించింది ఐసీసీ.

పాక్‌ యూటర్న్‌
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచి.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించింది. అయితే, ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ తదితర సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాక్‌ యూటర్న్‌ తీసుకుంది. కొలంబోలో ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామని స్పష్టం చేసింది.

ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నారంటూ..
ఇక బంగ్లాదేశ్‌ బోర్డుకు సైతం ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్‌ నజ్రుల్‌ తమ మాటల్ని పూర్తిగా మార్చేశాడు. ‘‘ప్రపంచకప్‌ టోర్నీలో ఆడలేకపోయినందుకు మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.

టోర్నీలో ఆడకూడదన్నది పూర్తిగా బీసీబీ, ఆటగాళ్ల నిర్ణయమే. దేశ క్రికెట్‌ను రక్షించేందుకు వారు త్యాగాలు చేశారు. బంగ్లాదేశ్‌ ప్రజలను కాపాడుకునేందుకు.. జాతీయ సమగ్రతను చాటేందుకు వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అంటూ అర్థంపర్థం లేకుండా మరీ దారుణంగా నాలుక మడతేశాడు.

ఛీ.. మరీ ఇంత దారుణమా?
దీంతో బంగ్లాదేశ్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యూటర్న్‌లు తీసుకోవడంలో బంగ్లా పాకిస్తాన్‌నే మించిపోతుందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని సోషల్‌ మీడియా వేదికగా ఛీత్కరించుకుంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసి ఆటగాళ్ల కలలను నీరుగార్చారని బంగ్లా ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

కాగా భారత క్రికెట్‌, ఐసీసీతో సత్సంబంధాలు కొనసాగించి సమస్య పరిష్కరించుకోవాలని మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ వంటి ఆటగాళ్లు బీసీబీకి సూచించారు. అయితే, బంగ్లా బోర్డులోని ఓ అధికారి అతడిని భారత ఏజెంట్‌ అంటూ విమర్శించాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల సంఘం సమావేశం ఏర్పాటు చేసి అతడితో రాజీనామా చేయించేలా ఒత్తిడి తెచ్చారు.

ఆటగాళ్లపై నెపం
బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ సైతం తమకు వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉందని.. అయితే, ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కానీ నజ్రుల్‌ మాత్రం ఇలా ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటూ యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం. 

కాగా బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా మైనారిటీ హిందువుల మీద హత్యాకాండ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌- బంగ్లా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్‌-శ్రీలంక వేదికగా రల్డ్‌కప్‌ టోర్నీ మొదలైన సంగతి తెలిసిందే.

చదవండి: పాక్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement