భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం ముదురుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చినట్లుగా కనిపించిన.. బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) నిజ స్వరూపం తాజాగా తేట తెల్లమైంది. తమ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పట్ల బీసీబీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.
బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైనారిటీ హిందూలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తొలగించారు.
తెగేదాకా లాగొద్దు
ఇందుకు ప్రతిగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు తాము హాజరు కాబోమని బీసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించి భద్రతా కారణాలు చూపిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. ఈ విషయంలో తెగేదాకా లాగొద్దని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బీసీబీని హెచ్చరించాడు.
ఐసీసీ నుంచే బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారీ మొత్తంలో ఆదాయం వస్తోందని.. సున్నితమైన ఈ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఐసీసీతో సంబంధాలు చెడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లు, బంగ్లా క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు.
ఇండియన్ ఏజెంట్ అంటూ..
ఈ విషయంపై బీసీబీ ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎం. నజ్ముల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి బంగ్లాదేశ్ ప్రజలు.. తాను ఇండియన్ ఏజెంట్‌ను అని నిరూపించుకున్న వ్యక్తి నిజ స్వరూపాన్ని కళ్లారా చూశారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఈ నేపథ్యంలో ‘క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్’ (CWAB) ఘాటుగా స్పందించింది. ‘‘బీసీబీ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం.. జాతీయ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.
తీవ్రంగా ఖండిస్తున్నాం
ఈ మాటలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఆందోళనకు గురిచేశాయి. పదహారేళ్లు జాతీయ జట్టు తరఫున ఆడిన, విజయవంతమైన ఆటగాడి పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఏ కారణంగానూ ఇవి ఆమోదయోగ్యనీయం కాదు. సామాజిక మాధ్యమం వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది చాలా అవమానకరం. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాము. సదరు అధికారి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని CWAB డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా.. బీసీబీ అధికారి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.


