షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్‌ ధనాధన్‌ దంచికొట్టగా.. | T20 WC 2026 NZ vs SL Super 8: Santner MCconchie Guides NZ To 168 | Sakshi
Sakshi News home page

షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్‌ ధనాధన్‌ దంచికొట్టగా..

Feb 25 2026 8:54 PM | Updated on Feb 26 2026 8:39 AM

T20 WC 2026 NZ vs SL Super 8: Santner MCconchie Guides NZ To 168

శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్‌ కకావికలమైనా లోయర్‌ ఆర్డర్‌ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 మ్యాచ్‌లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక.. కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఈ క్రమంలో కివీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (13 బంతుల్లో 23)ను మహీశ్‌ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

పెవిలియన్‌కు క్యూ
అయితే, టాపార్డర్‌ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు మాత్రం పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్‌ ఫిలిఫ్స్‌ (18), డారిల్‌ మిచెల్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్‌ చాప్‌మన్‌ డకౌట్‌ అయ్యాడు.

సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 47 పరుగులు సాధించాడు. 

రాణించిన మెకాంచీ
ఇక జేమ్స్‌ నీషమ్‌ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోల్‌ మెకాంచీ సాంట్నర్‌కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్‌ వెల్లలగే ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. 

తుదిజట్లు
శ్రీలంక
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement