అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌ | T20 WC IND Vs ZIM, Team India Batting Coach Sitanshu On Tilak Abhishek Sanju Over Team Selection And Strategy | Sakshi
Sakshi News home page

అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

Feb 25 2026 4:18 PM | Updated on Feb 25 2026 4:43 PM

T20 WC IND vs ZIM: Batting coach Sitanshu on Tilak Abhishek Sanju

సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్‌-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.

ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ల గురించి కొటక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

సంజూకు మొండిచేయి
కాగా ఇషాన్‌ కిషన్‌ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లలో అభిషేక్‌ శర్మ- ఇషాన్‌ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్‌ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.

తిలక్‌ వర్మ ఆట తీరుపై విమర్శలు
మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

తిలక్‌ గురించి బాధ లేదు
ఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్‌ మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.

అభిషేక్‌ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.

సంజూ రావొచ్చు
ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. 

అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్‌ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.

సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో
ఇదిలా ఉంటే.. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్‌ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్‌-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. 

సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement