T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ | Rinku Singh Family Emergency, Update Arrives On IND vs ZIM Participation | Sakshi
Sakshi News home page

T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Feb 25 2026 1:39 PM | Updated on Feb 25 2026 2:14 PM

Rinku Singh Family Emergency, Update Arrives On IND vs ZIM Participation

టీ20 ప్రపంచకప్‌ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని​ ఉండింది.

అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్‌ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్‌ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్‌ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్‌ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్‌మెంట్‌ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 

రింకూ లేని పక్షంలో మరో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్‌మెంట్‌ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.

కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.

సంజూ శాంసన్‌ పరిస్థితి ఏంటి..?
రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్‌తో పాటు సంజూను ఓపెనర్‌గా పంపి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. 

రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం​ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే మాత్రం తిలక్‌ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్‌-సంజూ ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ను కూడా పక్కకు పెట్టి, అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

తుది జట్టు (అంచనా)..
అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement