T20 WC 2026: మిల్లర్‌తో రీల్‌ చేసిన అమ్మాయికి రేప్‌ బెదిరింపులు | Indian Influencer Gets Rape Threats, Forced To Delete Filmed Moment With David Miller | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మిల్లర్‌తో రీల్‌ చేసిన అమ్మాయికి రేప్‌ బెదిరింపులు

Feb 25 2026 8:45 AM | Updated on Feb 25 2026 9:08 AM

Indian Influencer Gets Rape Threats, Forced To Delete Filmed Moment With David Miller

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ 35 బంతుల్లో 63 పరుగులు చేసి సౌతాఫ్రికా గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

ఈ అవార్డు ప్రధానోత్సవం తర్వాత ఐసీసీ ఆహ్వానిత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ప్రిన్సీ పారిఖ్‌ మిల్లర్‌తో ఓ రీల్‌ చేసింది. మిల్లర్‌ చుట్టూ తిరుగుతూ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టింది. ఈ రీల్‌ను ఆమె తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. చాలామందికి ఈ రీల్‌ సరదాగా అనిపించగా.. కొందరికి మాత్రం నచ్చలేదు. ఫలితంగా పారిఖ్‌పై ఆన్‌లైన్‌ దాడులు జరిగాయి. ఫేస్‌బుక్‌లో రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న పారిఖ్‌.. ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్‌ చేస్తూ.. డేవిడ్ మిల్లర్‌తో చేసిన వీడియోని ఫేస్‌బుక్‌ నుంచి తొలగించాను. ఎందుకంటే వందలాది అసభ్యకరమైన కామెంట్లు, రేప్ బెదిరింపులు రావడం భరించలేకపోయానని పేర్కొన్నారు. అసభ్య కామెంట్లు పెట్టిన వారి అకౌంట్ల యూజర్‌నేమ్‌లు, మెసేజ్‌లు బయట పెడతానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మున్ముందు ఎవరికీ ఇలాంటి బెదిరింపులు రాకూడదని రాసుకొచ్చారు.  

ప్రిన్సీ పారిఖ్‌ ఐసీసీ ఆహ్వానించిన ఇన్‌ఫ్లూయెన్సర్లలో ఒకరు. ఆమెకు ఇన్‌స్టాలో 1.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 30 వేల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె గతంలో హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్, స్మృతి మంధానతో కూడా రీల్స్‌ చేశారు.

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్‌కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వెస్టిండీస్‌, సౌతాఫ్రికా తమతమ తొలి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి సెమీస్‌ రేసులో దూసుకుపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement