టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుతుందా? లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో పరిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో ఉంది. నెట్‌రన్ రేట్(-3.800) భారీగా పడిపోయింది.
దీంతో భారత్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలతో పాటు, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ భారత్ విఫలమైంది.
21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సఫారీలను భారత బౌలర్లు ఆపలేకపోయారు. మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వద్ద సరైన ఫాస్ట్ బౌలర్లు లేరని అక్తర్ అన్నాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు.
"సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అతడిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.
వారిద్దరూ ఏమి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే మాల్కమ్ మార్షల్‌లు కారు. డెత్ ఓవర్లలో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రోటీస్‌తో మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా 45 పరుగులు సమర్పించుకున్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.


