టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కాగా.. తిలక్ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ 13 పరుగులు చేయగా, తిలక్ డకౌటయ్యాడు. ఇప్పటివరకు తిలక్ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.
అతని స్ట్రైక్ రేట్ 119 కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయని అతడు హెచ్చరించాడు.
"అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవలం గార్డెన్ మాత్రమే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బలి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానిని తట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాలి.


