మా వాళ్లు అద్భుతం.. విండీస్‌ ప్రమాదకర జట్టు: మార్క్రమ్‌ | Aiden Markram Praises South Africa After Crushing India By 76 Runs In T20 WC Super 8 Clash, Says Drop The Ego | Sakshi
Sakshi News home page

మా వాళ్లు అద్భుతం.. విండీస్‌ ప్రమాదకర జట్టు: మార్క్రమ్‌

Feb 23 2026 3:57 PM | Updated on Feb 23 2026 4:34 PM

Great: Markram after SA crush IND by 76 runs in T20 WC Super 8 clash

టీమిండియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో తమను ఓడించి ట్రోఫీ గెలుచుకున్న భారత్‌కు.. తాజా ఎడిషన్‌లో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 వరల్డ్‌కప్‌-2026 సూపర్‌-8లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేనను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

మా వాళ్లు అద్భుతం
పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో టీమిండియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత రీతిలో రాణించారని ప్రశంసలు కురిపించాడు. గొప్ప ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేశామని సంతోషం వ్యక్తం చేశాడు.

‘‘ఈ వికెట్‌ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మా వాళ్లు పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని.. అద్భుతమైన నైపుణ్యాలతో వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతం చేశారు.

ఆ  భాగస్వామ్యం అత్యంత కీలకం
ఇక మిల్లర్‌, బ్రెవిస్‌ నెలకొల్పిన భాగస్వామ్యం అత్యంత కీలకం. మ్యాచ్‌ను మా వైపు తిప్పేసింది వాళ్లే. లుంగి ఎంగిడి వంటి ప్రమాదకర బౌలర్‌ మా జట్టులో ఉన్నాడు. మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకం. జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడు బౌలింగ్‌ చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడు.

టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి
తదుపరి మేము వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆ జట్టు టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి. కాబట్టి టీమిండియాపై విజయాన్ని ఆస్వాదిస్తూనే తదుపరి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్దమవుతాము. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న ఫలితం రాబడతాము’’ అని మార్క్రమ్‌ పేర్కొన్నాడు.

కాగా టీమిండియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి.. 187 పరుగులు సాధించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29 బంతుల్లో 45), డేవిడ్‌ మిల్లర్‌ (35 బంతుల్లో 63) యాభై బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

కుప్పకూలిన టీమిండియా
ఇక లక్ష్య ఛేదనలో భారత్‌ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు విజయవంతమయ్యారు. మార్కో యాన్సెన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్‌ బాష్‌ రెండు, మార్క్రమ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఎంగిడి నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

ఈ క్రమంలో 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఫలితంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో జయభేరి మోగించి సెమీస్‌ దిశగా తొలి అడుగు వేసింది. ఇక భారత్‌ తదుపరి గురువారం జింబాబ్వేతో.. సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడతాయి.

చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement