టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ (15) విఫలమైన అభిషేక్ శర్మ గాయంతోనే ఈ మ్యాచ్‌లన్నీ ఆడాడని వైభవ్ భోలా అనే క్రీడా జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టే కలకలానికి కారణమైంది.
వైభవ్ భోలా పోస్ట్ ప్రకారం.. అభిషేక్ శర్మ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందే గాయపడ్డాడు. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన అధికారిక ఫోటోషూట్ కార్యక్రమంలో అభిషేక్ చేతికి గాయమైంది. దీని వల్ల అతనికి కుట్లు కూడా పడ్డాయి. అయినా, భారత మేనేజ్‌మెంట్ దాన్ని దాచి అభిషేక్‌ను యూఎస్‌ఏతో మ్యాచ్‌లో ఆడించింది. ఆ మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌటయ్యాడు.
ఆ తర్వాత అతనికి కడుపు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పటి వరకు మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ వరుస వైఫల్యాల బాట పట్టడానికి ఇదే కారణమా అని వైభవ్ తన పోస్ట్ ద్వారా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు.
ఈ పోస్ట్‌కు అభిషేక్ చేతికి బ్యాండ్ ఎయిడ్ ఉన్న ఫోటోను జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అభిషేక్ శర్మకు నిజంగానే గాయమైందా.. దాన్ని దాచిపెట్టే భారత మేనేజ్‌మెంట్ అతన్ని బరిలోకి దించుతుందా అని భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్‌లో నిజానిజాలు ఎంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత మేనేజ్‌మెంట్ తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
ఒకవేళ అభిషేక్‌కు నిజంగా గాయమై ఉంటే, కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. దీని మూల్యం జట్టు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.
ఈ సంచలన వార్తలో నిజానిజాలను పక్కన పెడితే.. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడన్నది కాదనలేని సత్యం. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అభిషేక్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. భారీ అంచనాలు ఆ ఒత్తిడిని మరింత అధికం చేశాయి. ఇదే అతని వైఫల్యాలకు ప్రధాన కారణమయ్యుండవచ్చు.
అభిషేక్ ఫామ్ కోల్పోవడంపై తాజాగా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే అతను ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని.. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆతృత పక్కన పెట్టి, సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు.
గవాస్కర్ విషయాన్ని కూడా పక్కన పెడితే.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో అభిషేక్ 15 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్‌కు ఈ ఘోర పరాభవం తప్పేది. అప్పటికి అభిషేక్ ఆచితూచి ఆడాలనే ప్రయత్నం చేసినా, సౌతాఫ్రికా బౌలర్ల ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాడు. ఏదిఏమైనా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం భారత సెమీస్ అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసేసింది. ఈ ఓటమి తర్వాత భారత రన్‌రేట్ -3.80కి పడిపోయింది. జింబాబ్వే, విండీస్‌తో జరిగే మిగతా రెండు సూపర్-8 మ్యాచ్‌ల్లో నెగ్గినా టీమిండియా తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.


