టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పు జరుగనుందని తెలుస్తుంది. జింబాబ్వేతో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు (ఫిబ్రవరి 26) స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సంజూ టాకింగ్ పాయింట్ అవుతాడని డస్కటే సౌతాఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.
సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారన్నదే, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా లేక చెత్త ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డస్కటే వ్యాఖ్యలను అంచనా వేస్తే.. అభిషేక్‌పైనే వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఎందుకంటే డస్కటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించాడు. అతని మాటల్లో.. టాపార్డర్‌లో ఉన్న ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ బౌలర్లకు బలవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్‌లో సల్మాన్ ఆఘా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మార్క్రమ్ పవర్‌ప్లేలోనే వికెట్లు తీశారు. దీంతో తక్కువ స్కోర్లకే భారత్ వికెట్లు కోల్పోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజూని జట్టులోకి తీసుకురావాలా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమని డస్కటే అన్నారు.
డస్కటే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రత్యర్ది ఆఫ్ స్పిన్ ప్రయోగాలను విజయవంతంగా ఎదుర్కొని, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాపార్డర్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ సంజూ మాత్రమే. సంజూను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్ కిషన్‌తో కలిసి కుడి-ఎడమ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్‌తో ఆఫ్ స్పిన్నర్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మిగతా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌కు కూడా భంగం కలిగించవచ్చు. జింబాబ్వే మ్యాచ్‌లో భారత మేనేజ్‌మెంట్ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి.
ఇషాన్‌కు డిమోషన్..?
ఒకవేళ భారత మేనేజ్‌మెంట్ తదుపరి మ్యాచ్‌ల్లో సంజూను జట్టులోకి తీసుకొని, అభిషేక్‌ను కూడా కొనసాగించాలనుకుంటే గత కొంతకాలంగా చెత్త ఫామ్‌లో తిలక్ వర్మపై వేటు వేయక తప్పదు. అప్పుడు అభిషేక్, సంజూతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో పంపవచ్చు. అయితే ఈ అడుగు పడటం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, ఓపెనర్‌గా ఇషాన్ మంచి లయలో ఉన్నాడు. అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడమంటే చాలా పెద్ద సాహసం అవుతుంది. సెమీస్ అవకాశాలు కఠినమైన తరుణంలో భారత మేనేజ్‌మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు.


