టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.
ఒకట్రెండు డాట్ బాల్స్ పడంగానే భారత బ్యాటర్లు సహనాన్ని కోల్పోయారు. మూడో బంతికి కచ్చితంగా బౌండరీనో, సిక్సరో బాదాలనే ఆత్రంలో వికెట్ పారేసుకున్నారు. భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే జరిగింది. ముందుగా క్రీజ్‌లో కుదురుకోవాలన్న బేసిక్ సెన్స్ ఏ ఒక్కరిలో కనపడలేదు. స్ట్రయిక్ రొటేట్ అవుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. కానీ భారత బ్యాటర్లు దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిని బాధడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇలా జరగడం చాలా కష్టం. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మధ్యలో చెత్త బంతులపై ఎదురుదాడి చేసుంటే బాగుండేది, కానీ భారత బ్యాటర్లు అలా చేయలేదు.
ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకుందామని అలోచించలేదు. అయితే సిక్సర్ లేకపోతే ఔట్ అన్నట్లు వ్యవహరించారు. ఇదే భారత్ కొంపముంచింది. సౌతాఫ్రికా కెప్టెన్ వూహాత్మకంగా ఓ వైపు నుంచి స్పిన్నర్లు, మరోవైపు నుంచి పేసర్లతో అటాక్ చేస్తున్నా, భారత బ్యాటర్లు మొండిగా ముందుకు వెళ్లారు. అందుకు తగిన మూల్యం చెల్లంచుకున్నారు.
ఇదే ఆటతీరును జింబాబ్వే, విండీస్ మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవాలన్న కల సాకారం కాకపోవచ్చు. కాబట్టి భారత బ్యాటర్లు సౌతాఫ్రికా మ్యాచ్‌తో గుణపాఠం నేర్చుకుంటే మంచిదన్నది అభిమానులందరి అభిప్రాయం.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బ్రెవిస్-మిల్లర్-స్టబ్స్ త్రయం బుమ్రా, అర్షదీప్ మినహా మిగతా భారత బౌలర్లందరిపైనా విరుచుకుపడ్డారు.
వరుణ్ చక్రవర్తి (4-0-47-1), హార్దిక్ పాండ్యా (4-0-45-0), శివమ్ దూబే (2-0-32-1), వాషింగ్టన్ సుందర్ (2-0-17-0)పై ఎదురుదాడి చేశారు.
అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు సైతం ఆదిలోనే తడబడ్డారు. అయితే సౌతాఫ్రికన్లలా కాకుండా మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత ఓటమి ఛేదన ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఖరారైపోయింది. నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్‌లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్‌కు చేరాడు. గత మూడు మ్యాచ్‌ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే పలు చూడముచ్చటైన షాట్లు ఆడినా, బంతులు వృధా కావడంతో ఒత్తిడిలో పడి వికెట్ సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.
మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు.


