సూపర్–8 తొలి పోరులో భారత్ ఓటమి
76 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
రాణించిన మిల్లర్, యాన్సెన్
టీమిండియా సమష్టి వైఫల్యం
గురువారం జింబాబ్వేతో తర్వాతి మ్యాచ్
భయపడినట్లే జరిగింది. గ్రూప్ దశలో మూడు చిన్న జట్లతో పాటు పాకిస్తాన్‌లాంటి బలహీన టీమ్‌పై గెలిచినా భారత జట్టు ప్రదర్శనపై ఎక్కడో కొంత సందేహం. తమ స్థాయికి తగ్గ ఆట కనబర్చడం లేదని, ప్రత్యర్థులను పూర్తిగా తొక్కేసే విధంగా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంలేదని అనిపించింది. బలమైన ప్రత్యర్థి ఎదురైతే ఇలాంటి ఆటతో ఇబ్బంది తప్పదని సందేహం వచ్చింది. చివరకు దక్షిణాఫ్రికా మన బలహీనతలను బాగా గుర్తించి దెబ్బ కొట్టింది.
అహ్మదాబాద్ మైదానంలో ఎంత భారీ స్కోరు అయినా ఛేదన సులువు అని రికార్డులు చెబుతుండటంతో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పు చేసినట్లుగా మ్యాచ్‌కు ముందు చర్చ మొదలైంది. కానీ ఈ టోర్నీలో ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీలు పిచ్‌ను సరిగ్గా అంచనా వేశారు. భారీ స్కోరు సాధించి కాపాడుకోగలమని నమ్మారు. పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా పడగొట్టారు.
2024 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి వరల్డ్ కప్ వేదికపైనే ప్రతీకారం తీర్చుకున్నారు. గత మ్యాచ్‌లలో ఒకరు విఫలమైనా... మన జట్టును ఆదుకునేందుకు మరొకరు సిద్ధమయ్యారు. ఈసారి అంతా సమష్టి వైఫల్యమే. చివర్లో శివమ్ దూబే మెరుపులు కూడా ఒక లాంఛనం మాత్రమే. ఈ ఓటమి అనుభవంతో భారత్ తర్వాతి మ్యాచ్‌లకు ఎలాంటి వ్యూహంతో ఆడుతుందో చూడాలి.
అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2024 టి20 ప్రపంచకప్ టోర్నీ నుంచి మొదలు పెడితే వరుసగా 13 మ్యాచ్‌లు నెగ్గిన భారత్ గెలుపు పరుగు ఎట్టకేలకు ఆగింది. ‘సూపర్–8’ దశలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా, బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 51 బంతుల్లోనే 97 పరుగులు జోడించగా, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.
శివమ్ దూబే (37 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. మార్కో యాన్సెన్ (4/22) భారత్‌ను దెబ్బ తీయగా, కేశవ్ మహరాజ్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ తర్వాతి సూపర్ ఎయిట్స్ మ్యాచ్‌లో గురువారం చెన్నైలో జింబాబ్వేతో తలపడుతుంది.
కీలక భాగస్వామ్యం...
బుమ్రా, అర్ష్ దీప్ పదునైన బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. బుమ్రా తన వరుస ఓవర్లో డికాక్ (6), రికెల్టన్ (7)లను వెనక్కి పంపించగా, ఈ రెండు వికెట్ల మధ్య ఓవర్లో మార్క్‌రమ్ (4)ను అర్ష్ దీప్ అవుట్ చేశాడు. దాంతో సఫారీ టీమ్ 20/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్రెవిస్, మిల్లర్ కలిసి దూకుడుగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. పవర్‌ప్లేలో జట్టు 41 పరుగులు చేసింది.
ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు బాది మిల్లర్ జోరు ప్రదర్శించగా, వరుణ్ ఓవర్లో బ్రెవిస్ వరుసగా 4, 6 కొట్టాడు. అదే ఓవర్లో మిల్లర్ కూడా సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దూబే ఓవర్లోనూ ఫోర్, సిక్స్ బాదిన బ్రెవిస్ అతని తర్వాతి ఓవర్లో అవుట్ కావడంతో ఎట్టకేలకు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు 26 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
15 ఓవర్ల తర్వాత 144/4తో సఫారీ జట్టు 200 స్కోరుపై కన్నేసింది. అయితే ఇక్కడ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో టీమిండియా సఫలమైంది. బుమ్రా చక్కటి బౌలింగ్‌తో తన రెండు ఓవర్లలో 8 పరుగులే ఇవ్వడంతో 16–19 మధ్య మొత్తం 23 పరుగులే రాగా, దక్షిణాఫ్రికా 3 వికెట్లు కూడా చేజార్చుకుంది. కానీ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో స్టబ్స్ ఫోర్, 2 సిక్స్‌లు సహా 20 పరుగులు రాబట్టాడు.
టపటపా...
భారీ ఛేదనలో ఏ దశలోనూ భారత్ గెలిచేలా కనిపించలేదు. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (0) అవుటైన తర్వాత తర్వాతి ఓవర్ తొలి బంతికే తిలక్ వర్మ (1) వెనుదిరిగాడు. ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ (15) కూడా క్రీజ్‌లో ఉన్నంతసేపు తడబడ్డాడు. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 31/3.
బ్యాటింగ్‌లో ముందుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ (11) ప్రభావం చూపలేకపోగా, కెప్టెన్ సూర్యకుమార్ (22 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ కూడా పేలవంగా ముగిసింది. హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (0) ఒకే స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. 30 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేయాల్సిన స్థితిలో దూబే కొంత ధాటిని ప్రదర్శించాడు. అతను మూడు సిక్స్‌లతో గెలుపు అంతరాన్ని తగ్గించగలిగాడు!
మ్యాచ్‌లో సుందర్ పిచాయ్...
భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు అతిథిగా హాజరయ్యారు. మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్‌తో కలిసి ఆయన టి20 వరల్డ్ కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కామెంటరీ బాక్స్‌లో కూడా రవిశాస్త్రితో ఆయన ముచ్చటించారు.

క్రికెట్‌కు తాను వీరాభిమానినని, 80వ దశకంలో భారత మ్యాచ్‌లను చూస్తూ నాటి ఆటగాళ్లకు అభిమానిగా మారానని సుందర్ గుర్తు చేసుకున్నారు. ఐసీసీ ‘గ్లోబల్ పార్ట్‌నర్స్’లో ఒకటిగా ఉన్న గూగుల్ సంస్థ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
76 పరుగుల పరంగా టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిదే అతిపెద్ద ఓటమి.
33 టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 32 వికెట్లతో అశ్విన్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా 33 వికెట్లతో బద్దలు కొట్టాడు.
2 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత భారత జట్టు ఐసీసీ పరిమిత ఓవర్ల (వన్డే, టి20) టోర్నీల్లో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ రెండు పరాజయాలు అహ్మదాబాద్ (2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్) వేదికపైనే వచ్చాయి.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 4; డికాక్ (బి) బుమ్రా 6; రికెల్టన్ (సి) దూబే (బి) బుమ్రా 7; బ్రెవిస్ (సి) అభిషేక్ (బి) దూబే 45; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 63; స్టబ్స్ (నాటౌట్) 44; యాన్సెన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 2; బాష్ (సి) అండ్ (బి) బుమ్రా 5; రబాడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–10, 2–12, 3–20, 4–117, 5–152, 6–158, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–28–2, బుమ్రా 4–0–15–3, వరుణ్ 4–0–47–1, సుందర్ 2–0–17–0, పాండ్యా 4–0–45–0, దూబే 2–0–32–1.
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) మార్క్‌రమ్ 0; అభిషేక్ (సి) బాష్ (బి) యాన్సెన్ 15; తిలక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 1; సూర్యకుమార్ (సి) బ్రెవిస్ (బి) బాష్ 18; సుందర్ (సి) డికాక్ (బి) బాష్ 11; దూబే (సి) ఎన్‌గిడి (బి) యాన్సెన్ 42; పాండ్యా (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 18; రింకూ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 0; అర్ష్ దీప్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 1; వరుణ్ (నాటౌట్) 0; బుమ్రా (సి) మార్క్‌రమ్ (బి) యాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–26, 4–43, 5–51, 6–86, 7–86, 8–88, 9–111, 10–111.బౌలింగ్: మార్క్‌రమ్ 1–0–5–1, యాన్సెన్ 3.5–0–22–4, రబాడ 4–0–32–0, ఎన్‌గిడి 4–0–15–0, మహరాజ్ 3–0–24–3, బాష్ 3–0–12–2.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X జింబాబ్వే
వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


